హాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్: బాక్సాఫీస్ క్లాష్‌తో 40 శాతం వసూళ్లు లాస్?
భారతదేశంలో ఉన్న పరిమిత సంఖ్యలోని థియేటర్లలో ఒకేసారి నాలుగు భారీ చిత్రాలను సర్దుబాటు చేయడం పంపిణీదారులకు పీడకలగా మారనుంది.;
భారతీయ సినిమా వ్యాపారం ఇటీవలి కాలంలో అత్యంత ఉత్కంఠభరితంగా మారుతోంది. ముఖ్యంగా 2026 చివరలో హాలీవుడ్- బాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు ఒకే సమయంలో బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయనే వార్తలు పంపిణీదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఒకే వారంలో ఇన్ని భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కావడం బాక్సాఫీస్ వసూళ్లపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోణంలోనే కాకుండా.. థియేటర్ల లభ్యత..స్క్రీన్ల విభజన పరంగా ఇది పెద్ద నష్టాలకు దారితీసే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న `గోల్‌మాల్ 5`.. షారూఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక చిత్రం `కింగ్` మధ్య బాక్సాఫీస్ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో షారూఖ్ వర్సెస్ అజయ్ దేవగన్ మధ్య జరిగిన `జబ్ తక్ హై జాన్`, `సన్ ఆఫ్ సర్దార్` వంటి పోరాటాలను ఈ క్లాష్ గుర్తు చేస్తోంది. అయితే ఈసారి పోటీ కేవలం బాలీవుడ్ చిత్రాల మధ్యే లేదు. ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్న హాలీవుడ్ సినిమాలు `అవెంజర్స్: డూమ్స్‌డే` .. `డ్యూన్ 3` కూడా అదే సమయంలో విడుదల కానుండటంతో.. భారతీయ బాక్సాఫీస్ వద్ద స్క్రీన్ల కోసం పెనుగులాట తప్పేలా లేదు.
భారతదేశంలో ఉన్న పరిమిత సంఖ్యలోని థియేటర్లలో ఒకేసారి నాలుగు భారీ చిత్రాలను సర్దుబాటు చేయడం పంపిణీదారులకు పీడకలగా మారనుంది. స్క్రీన్లు విభజించబడటం వల్ల ఏ సినిమా కూడా తన పూర్తి సామర్థ్యం మేరకు ఓపెనింగ్ డే కలెక్షన్లను సాధించలేదు. సాధారణంగా ఒక సినిమా సోలోగా విడుదలైనప్పుడు వచ్చే వసూళ్లు, ఇలాంటి క్లాష్‌ల వల్ల 30 నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల భారీ బడ్జెట్ చిత్రాలు బ్రేక్ ఈవెన్ సాధించడం మరింత కష్టతరమవుతుంది.
ప్రేక్షకుల పరంగా చూస్తే.. సెలవుల సమయంలో విభిన్న రకాల ఆప్షన్లు ఉండటం వల్ల ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కామెడీ కోరుకునే వారు `గోల్‌మాల్`కు, యాక్షన్ - గ్రాఫిక్స్ ఇష్టపడే వారు `కింగ్` లేదా `అవెంజర్స్`కు మొగ్గు చూపుతారు. అయితే ఏదైనా ఒక సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే మాత్రం.. పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులు వెంటనే మరో సినిమాకు మారిపోతారు. దీనివల్ల ఆ సినిమా కోలుకునే అవకాశం అస్సలు ఉండదు. వార్షిక వసూళ్ల రికార్డులపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. భారీ నష్టాలను నివారించడానికి ఎవరో ఒకరు వెనక్కి తగ్గడం అనివార్యం. తాజా సమాచారం ప్రకారం... షూటింగ్ ఆలస్యం -విఎఫ్ఎక్స్ పనుల కారణంగా `కింగ్` లేదా `గోల్‌మాల్ 5` చిత్రాలలో ఒకటి 2027 ప్రారంభానికి వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా జరగడం వల్ల థియేటర్ల సర్దుబాటు సులభతరమై.. ప్రతి సినిమా తన స్థాయికి తగ్గట్టుగా వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. సోలో రిలీజ్ ఎప్పుడూ సురక్షితమైన మార్గం కాబట్టి... నిర్మాతలు తెలివైన నిర్ణయం తీసుకుంటారని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ భారీ చిత్రాల ముందు నిలబడే గొప్ప కంటెంట్ ని షారూఖ్, దేవగన్ అందిస్తారనే ఆశిద్దాం.