బేసిక్ హిందీ కూడా రాదు.. సీతమ్మగా నటిస్తావా? సాయి పల్లవిపై ట్రోలింగ్!

సినిమా ప్రమోషన్లలో మాట్లాడే భాషకు.. సినిమాలో చేసే నటనకు సంబంధం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.;

Update: 2026-04-27 17:05 GMT

సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలకు గురవుతున్నారు. ఈ మ‌ల‌యాల బ్యూటీ నటించిన హిందీ చిత్రం `ఏక్ దిన్` మే 1న విడుదల కానున్న నేపథ్యంలో ముంబైలో `ఏక్ దిన్ కీ మెహఫిల్` పేరుతో ఒక సంగీత వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులను, మీడియాను ఉద్దేశించి సాయి పల్లవి హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తనకు హిందీ అంతగా రాదని నిజాయితీగా ఒప్పుకోవడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. అంతేకాదు.. సాయిప‌ల్ల‌వి తడబడుతూ హిందీ మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో హిందీ బెల్ట్ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ముఖ్యంగా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణ`లో సాయి పల్లవి సీతాదేవి పాత్ర పోషిస్తుండటంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీసం బేసిక్ హిందీ పదాలు కూడా రాని సాయి పల్లవిని సీతా మాత పాత్రకు ఎలా ఎంపిక చేస్తారు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హిందీ సరిగ్గా మాట్లాడలేని నటిని తీసుకోవడం ద్వారా నితీష్ తివారీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని.. ఇది చాలా దారుణమైన కాస్టింగ్ అని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి సొంతంగా డబ్బింగ్ చెబుతుందా లేక వేరొకరితో చెప్పిస్తారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

అయితే సాయి పల్లవిపై వస్తున్న ఈ ట్రోలింగ్‌ను త‌న‌ అభిమానులు, డైహార్డ్ ఫాలోవ‌ర్స్ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి హీరోయిన్లు కూడా హిందీ రాకపోయినా బాలీవుడ్‌లో రాణించలేదా? అని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒక‌ట్రెండు ఎక్స్ ప్రెష‌న్ల‌తోనే భాష తెలియ‌కుండానే క‌త్రిన కైఫ్ తెలుగు నాట `మ‌ల్లీశ్వ‌రి`గా ప‌రిచ‌యం కాలేదా? అంటూ రివ‌ర్స్ కౌంట‌ర్లు వేస్తున్నారు. నటన అనేది భాషకు అతీతమని.. నటీనటులు డైలాగ్స్‌ను కంఠస్థం చేసి భావోద్వేగాలను పండించడంలో దిట్టలని మద్దతు తెలుపుతున్నారు. గాయకులు అర్థం తెలియకపోయినా ఎన్నో భాషల్లో పాటలు పాడినట్లే.. నటులు కూడా ఏ భాషలోనైనా అద్భుతంగా నటించగలరని వారు కౌంటర్ ఇస్తున్నారు.

సినిమా ప్రమోషన్లలో మాట్లాడే భాషకు.. సినిమాలో చేసే నటనకు సంబంధం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో సాయి పల్లవి హిందీ డైలాగులు సరిగ్గా చెబితే చాలని..ఆమె ప్రతిభ గురించి తెలియకుండా ఇలాంటి ఆకతాయి ప్రశ్నలు వేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న `ఏక్ దిన్` సినిమాలో జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటించారు. 2016 నాటి థాయ్ చిత్రం `వన్ డే`కు రీమేక్‌గా వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

సాయి పల్లవి న‌టిగా దక్షిణాదిన‌ ఇప్పటికే తనదైన‌ ముద్ర వేసారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి భాషా భేధాలు తలెత్తడం అభిమానులను కలవరపెడుతోంది. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమేనని.. ఒక నటి ప్రతిభను కేవలం భాషా పరిజ్ఞానంతో కొలవలేమని మెజారిటీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మే 1న విడుదలయ్యే `ఏక్ దిన్`.. దీపావ‌ళి బ‌రిలో రానున్న `రామాయణ` చిత్రాలతో సాయి పల్లవి అన్ని విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతుంద‌నే ఆశిద్దాం.

Tags:    

Similar News