హీరోల డూప్స్, ఫేస్ స్వాప్.. జేడీ చక్రవర్తి ఉద్దేశం ఏంటి?

ఆ విషయాలు దర్శకులకు, నిర్మాతలకు, మొత్తం ఇండస్ట్రీకి తెలియవా అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.;

Update: 2026-04-27 18:30 GMT

టాలీవుడ్‌ లో టెక్నాలజీ వినియోగం, హీరోల పనితీరుపై నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినిమా షూటింగ్స్ లో డూపులు, ఫేస్‌ స్వాప్‌ లు, వీఎఫ్‌ఎక్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో జరుగుతున్న వాస్తవాలు స్పష్టంగా చెప్పినట్లుగా కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ చక్రవర్తి, కొంతమంది హీరోలు షూటింగ్‌ కు పూర్తి స్థాయిలో హాజరుకాకపోయినా, క్లోజ్‌ అప్ షాట్లు, డూపులు, ఫేస్‌ స్వాప్ టెక్నాలజీ సహాయంతో సినిమాలను పూర్తి చేస్తున్నారని అన్నారు. ఆ విషయాలు దర్శకులకు, నిర్మాతలకు, మొత్తం ఇండస్ట్రీకి తెలియవా అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్లతో ఎందుకు సినిమాలు చేస్తున్నారు అంటే, ఒకటే కారణం.. అది సదరు హీరోకు ఉన్న మార్కెట్ అని స్పష్టం చేశారు. 'ఒక హీరోకి మార్కెట్ ఉంటే నిర్మాతలు డబ్బు పెట్టడానికి వెనుకాడరు. వాళ్లకు లాభం వస్తుందనే నమ్మకం ఉంటుంది. కాబట్టి షూటింగ్ ఎలా జరిగింది? ఎవరు ఎంత పనిచేశారు? అనే విషయాల కంటే చివరికి సినిమా ఎంత కలెక్షన్లు తెచ్చింది అనేది ముఖ్యం' అని జేడీ చక్రవర్తి తెలిపారు.

ప్రేక్షకుల దృష్టిలో కూడా ఆ విషయాలు పెద్దగా ప్రభావం చూపవని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఆడియన్స్ చాలా సింపుల్. వారికి సినిమా కంటెంట్ నచ్చితే చూస్తారు, లేదంటే వదిలేస్తారు. ఎవరు డూప్ వేశారు, ఎక్కడ ఫేస్‌ స్వాప్ చేశారు, గెడ్డం దగ్గర వీఎఫ్‌ఎక్స్ వాడారు అనే విషయాలు వాళ్లు పెద్దగా పట్టించుకోరు' అని చెప్పారు. ఇప్పటికే కొన్ని సినిమాల ప్రమోషన్స్ లో నిర్మాతలు, దర్శకులు పలు విషయాలు చెబుతుంటారని అన్నారు.

సినిమాకి ఆరు నెలలు వీఎఫ్‌ఎక్స్ పని చేశామని, ఇంత ఖర్చు పెట్టామని చెప్పడం సాధారణంగా మారిందని ఆయన గుర్తుచేశారు. అంటే టెక్నాలజీ వినియోగం గురించి వాళ్లే ఓపెన్‌ గా చెబుతున్నారని, అందులో దాచి పెట్టే అంశం ఏమీ లేదని తెలిపారు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆయన కామెంట్స్ కు మద్దతు ఇస్తున్నారు.

ఇండస్ట్రీలో జరుగుతున్న వాస్తవాలు ధైర్యంగా చెప్పారని మరికొందరు అంటుంటే, ఇంకొందరు మాత్రం హీరోలపై ఆ విధంగా కామెంట్స్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా జేడీ చక్రవర్తి కామెంట్స్ సినిమా ప్రొడక్షన్ లో మార్పులు, టెక్నాలజీపై ఆధారపడుతున్న విధానాలు, అలాగే ప్రేక్షకుల టేస్ట్.. మరోసారి చర్చకు దారితీశాయి. ఏదేమైనా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారనే విషయాన్ని జేడీ చక్రవర్తి మరోసారి స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది.

Tags:    

Similar News