స్టార్‌ సన్‌.. పదిహేనేళ్ళు పూరి చేశాడు

Update: 2015-06-30 19:30 GMT
నటవారసత్వం అందరికీ కలిసిరాదు. ఏ పరిశ్రమని వెతికినా బోలెడన్ని నగ్నసత్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. ఇది అర్థమయ్యేలా చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు. 30, జూన్‌ 2000.. జూనియర్‌ మెగాస్టార్‌ అభిషేక్‌ బచ్చన్‌ తెరంగేట్రం చేసిన రోజు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అన్న ట్యాగ్‌లైన్‌తో హీరో అయ్యాడు. రెఫ్యూజీ రిలీజైంది. కానీ డిజాస్టర్‌ ఫలితం వచ్చింది.

తొలి సినిమా ఫ్లాపైనా తర్వాత తండ్రి ఇమేజ్‌ని పెంచే సత్తా ఉందని అభిమానులు నమ్మారు. కానీ అదే ఫలితం రిపీట్‌ రిపీట్‌. సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ రేంజ్‌ స్టార్‌ అయిపోతాడు అనుకుంటే ఎప్పటికీ అది కలగానే మిగిలిపోయింది. ఒకవైపు తనతో పాటే పరిశ్రమకి పరిచయమైన కరీనాకపూర్‌ బాలీవుడ్‌ని ఏలింది. అలాగే తనతో పాటే కెరీర్‌ సాగించి, తర్వాత తన భార్య అయిన ఐశ్వర్యారాయ్‌ ప్రపంచాన్నే ఏలింది. ఇప్పటికీ స్టార్‌డమ్‌ ఉన్న నాయికగా చక్రం తిప్పుతూనే ఉంది. తన ముందే చాలామంది కుర్రహీరోలు, నటవారసులు తిరిగులేని పొజిషన్‌కి చేరారు. కానీ ఇప్పటికీ అభిషేక్‌ బచ్చన్‌ స్టార్‌ హీరో అని ఎవరూ అనరు. ఆ సంగతి అభిషేక్‌కి కూడా తెలుసు.

అయితే అభిషేక్‌ కెరీర్‌ ఆమాత్రం అయినా నిలబడింది అంటే బంటి ఔర్‌ బబ్లీ, దోస్తానా, గురూ వంటి చిత్రాలు తన కెరీర్‌లోకి వచ్చాయి కాబట్టే. ఏదేమైనా నటవారసత్వం ఒక్కటే సూపర్‌స్టార్‌ అవ్వడానికి సరిపోదు అని చెప్పడానికే ఇదంతా. ఈ రోజుతో అభిషేక్‌ కెరీర్‌ 15 సంవత్సరాలు పూర్తయింది. అందుకే ఈ స్పెషల్‌.

Tags:    

Similar News