రజనీ, కమల్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా?
కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.;
కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఒకే సినిమా లో కనిపించనున్నారు కమల్, రజనీ. దీంతో ఆ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను రీసెంట్ గా చిత్రబృందం విడుదల చేసింది. అందులో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. వీడియోలో ఇందులో హీరో ఎవరు? అని ఇద్దరూ సరదాగా ప్రశ్నించుకునే సీన్ అభిమానులను అలరిస్తోంది. కాస్ట్యూమ్స్, బూట్లు, బెల్టులు, వాచ్ లు, కళ్లద్దాలతో ఒకరికి ఒకరు తగ్గకుండా స్క్రీన్ పై పోటీ పడుతున్నట్టు చూపించారు.
అయితే ఆ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఆ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రజనీకాంత్- కమల్ హాసన్ కలిసి చివరిసారిగా 1979లో విడుదలైన అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్ మూవీలో కనిపించారు.
ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఇద్దరూ కలిసి నటించలేదు. అందుకే ఇప్పుడు కొత్త మూవీపై అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ అప్పుడే విడుదల తేదీపై చర్చలు మొదలయ్యాయి. ఆ భారీ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కానీ ఇటీవలి కాలంలో చాలా పెద్ద సినిమాలు ముందుగానే విడుదల తేదీ ప్రకటించి, చివరి నిమిషంలో వాయిదా పడుతున్న సందర్భాలు ఎక్కువయ్యాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో రిలీజ్ డేట్లు మారుతున్నాయి. దీంతో ముందుగానే తేదీ ప్రకటించడం కంటే సినిమా పనులు పూర్తవ్వడానికి దగ్గర్లో ఉన్నప్పుడు ప్రకటిస్తే మంచిదని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ పై పూర్తి నమ్మకం ఉన్నప్పుడే విడుదల తేదీ ప్రకటిస్తారా? లేక అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారా? అదే సమయంలో తేదీ ప్రకటించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? అన్నది వేచి చూడాలి.