డెమోన్ పవన్ కి పితృవియోగం.. అసలు ఎలా జరిగిందంటే?

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.;

Update: 2026-03-10 12:48 GMT

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన తండ్రి దుర్గాప్రసాద్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా పవన్ తన తండ్రి ఆరోగ్యం పట్ల ఎంతో ఆందోళన చెందారు. కోలుకుంటున్నారని అనుకుంటున్న తరుణంలోనే ఆయన మరణించడం పవన్ కుటుంబాన్ని, అభిమానులను కలిచివేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్ స్టేజ్ మీద ఆ ఎమోషనల్ సీన్:

బిగ్‌బాస్ 9వ సీజన్‌లో పవన్ టాప్-3 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ వీక్ సమయంలో పవన్ తండ్రి దుర్గాప్రసాద్ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకులంతా ఎమోషనల్ అయ్యారు. ఇక క్యాన్సర్ కారణంగా నోటి సర్జరీ జరిగి, దవడ తొలగించడంతో ఆయనకు మాటలు సరిగా రాలేదు. అయినప్పటికీ, కొడుకు మీద ప్రేమతో.. "నా గురించి ఆలోచించొద్దు నాన్నా, నువ్వు బాగా ఆడి గెలవాలి" అంటూ ఆయన చెప్పిన మాటలు అందరి గుండెలను పిండేశాయి. ఇక నాగార్జున గారిని హగ్ చేసుకుని ఆయన చూపించిన అమాయకత్వం, కొడుకు విజయం పట్ల ఆయనకున్న ఆరాటం ప్రతి తండ్రికి కనెక్ట్ అయింది.

అసలు ఏం జరిగింది? :

పవన్ తండ్రికి క్యాన్సర్ ఎలా సోకిందో చెప్తూ గతంలో పవన్ చాలా ఎమోషనల్ అయ్యారు. నాలుకకి పన్ను గుచ్చుకుని అది సెప్టిక్ అవ్వడంతో, సాధారణ సమస్యే అని మొదట భావించారు. కానీ హైదరాబాద్‌లో పరీక్షలు చేయిస్తే అది నోటి క్యాన్సర్‌గా తేలింది. వెంటనే సర్జరీ చేసి లోపల ఉన్న చర్మాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆయన చాలా రోజులు మంచానికే పరిమితమయ్యారు. తిండి కూడా సరిగా తినలేని పరిస్థితిలో కూడా కొడుకు కి సపోర్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మెరుగుపడుతోంది అనుకుంటున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

పవన్ కెరీర్ వెనుక పెద్ద అండ ఆయన దీవెన :

పవన్ బిగ్‌బాస్ హౌస్‌లో విన్నర్ కాకపోయినా, మాస్ మహారాజా రవితేజ ఆఫర్ చేసిన రూ. 15 లక్షల సూట్‌కేస్‌తో తెలివిగా బయటకు వచ్చారు. తన తండ్రి వైద్య ఖర్చుల కోసం కూడా ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని నెటిజన్లు అప్పట్లో చర్చించుకున్నారు. ఇక పవన్ తన తండ్రిని ఎంతలా ప్రేమించేవారో బిగ్‌బాస్ జర్నీ వీడియోలో కూడా మనం చూశాం. తండ్రి భౌతికంగా లేకపోయినా, ఆయన నేర్పిన కష్టం, పట్టుదల పవన్‌ను ముందుకు నడిపిస్తాయని సోషల్ మీడియాలో అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇంట జరిగిన ఈ విషాదం పట్ల అయన అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News