ఆ సినిమా ఇండ‌స్ట్రీలో నూత‌న శ‌కం!

Update: 2021-06-29 01:30 GMT
సినిమా అనేది అంతిమంగా బిజినెస్. ప్రారంభంలో కొబ్బ‌రి కాయ కొట్ట‌డానికి డ‌బ్బులు కావాలి.. చివ‌ర్లో గుమ్మ‌డి కాయ కొట్ట‌డానికి కూడా డ‌బ్బులే కావాలి. మొత్తం డ‌బ్బు చుట్టూ తిరిగే ఈ వ్యాపారంలో.. సంపాదించుకునేవారు కొంద‌రైతే.. స‌ర్వం పోగొట్టుకునేవారు ఎంద‌రో! అయితే.. అష్ట‌క‌ష్టాలు ప‌డి సినిమా తీసినా.. రిలీజ్ చేసుకోలేక ల్యాబుల్లో మ‌గ్గిపోయే సినిమాల‌కు కొద‌వ‌లే లేదు.

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌తీ సంవ‌త్స‌రం 300 పైగా సినిమాలు షూటింగు మొద‌లు పెడితే.. క‌నీసం 10 నుంచి ప‌దిహేను శాతం సినిమాలు రిలీజ్ కావ‌ట్లేదు. ప్ర‌ధాన స‌మ‌స్య ఆర్థిక‌మే అని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కొన్ని థియేట‌ర్లు దొర‌క్క‌.. మ‌రికొన్ని త‌క్కువ మొత్తంలో అమ్ముకోవాల్సి రావ‌డం వంటి కార‌ణాల‌తో.. నిర్మాత‌లు కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మిళ ఇండ‌స్ట్రీలో ఓ స‌రికొత్త ఆలోచ‌న‌కు బీజం ప‌డింది. అదేమంటే.. ఇండ‌స్ట్రీ త‌ర‌పునే ఒక ఓటీటీ సంస్థ‌ను ఆరంభించాల‌ని భావిస్తున్నారు. ఇప్పుడు చాలా ఓటీటీలు ఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ.. ఆయా ఓటీటీలు కూడా చేసేది బిజినెస్సే. కాబ‌ట్టి.. లాభ‌సాటిగా ఉన్న సినిమాల‌ను, త‌క్కు ధ‌ర‌కు వ‌చ్చే సినిమాల‌ను మాత్ర‌మే కొనుగోలు చేస్తున్నాయి. దీంతో.. చిన్న సినిమాల‌కు ఇక్క‌డా ఇబ్బందే ఎదుర‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో.. ఇండ‌స్ట్రీ త‌ర‌పునే ఒక ఓటీటీని స్థాపించి.. విడుద‌లకు నోచుకోని చిన్న చిత్రాల‌ను ఇందులో ఆడించాల‌ని చూస్తున్నార‌ట‌. ఆ విధంగా వ‌చ్చే డ‌బ్బును నిర్మాత‌కే అప్ప‌గించాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌య‌త్నం ప్ర‌స్తుతానికి ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదిగ‌నక ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే.. చాలా మంది నిర్మాత‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

ఇదే ప‌ద్ధ‌తిలో తెలుగు ప‌రిశ్ర‌మతో మిగిలిన ఇండ‌స్ట్రీలు కూడా ఆచ‌రిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే.. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. క‌నీసం థియేట‌ర్ దొర‌క‌ట్లేద‌ని చిన్న సినిమాలు గోల చేస్తుండ‌డం త‌ర‌చూ వింటున్న‌దే. అందువ‌ల్ల‌.. అలాంటి వారికి ఫ్రీగా సినిమా ప్ర‌ద‌ర్శించుకునే వేదిక క‌ల్పిస్తే బాగుంటుంద‌ని అంటున్నారు. మ‌రి, ఇది ఎంత వ‌ర‌కు సాధ్య‌మ‌వుతుంద‌నేది చూడాలి.
Tags:    

Similar News