ప‌వ‌న్ క‌ల్యాణ్ Vs నిత్యామీన‌న్ .. ఓ రేంజులో..!

Update: 2021-08-08 05:16 GMT
ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్- ద‌గ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `అయ్యప్పనుం కోశియుమ్` తెలుగు రీమేక్ యాభై శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో చిత్రీక‌ర‌ణ సాగిస్తోంది. పవన్ కళ్యాణ్- నిత్యా మీనన్ ల‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మిగిలిన 50 శాతం షూట్ ని శరవేగంగా పూర్తి చేయ‌నున్నార‌ని తెలిసింది.

ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేట్రికల్ గా విడుదల కానుంది. వచ్చే ఏడాది జనవరి 12 న డేట్ ని లాక్ చేసారు. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా..త్రివిక్ర‌మ్  స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.

సంక్రాంతికి బిగ్ ఛాలెంజ్..!

2022  సంక్రాంతి బరిలో భారీ క్రేజీ సినిమాలు ఒక‌దానితో ఒక‌టి త‌ల‌ప‌డ‌నున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారీ అంతా మార్చేసిన క్ర‌మంలో చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా ప‌డ్డాయి. దీంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో పోటీ నువ్వా నేనా? అంటూ సాగ‌నుంది. మ‌హేష్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వెంక‌టేష్‌.. నాగార్జున‌.. ఎన్బీకే.. ప్ర‌భాస్ వంటి స్టార్లు న‌టించిన భారీ పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - టాలీవుడ్ హంక్ రానా క‌థానాయ‌కులుగా సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న  మ‌ల్టీ స్టార‌ర్ `భీమ‌ల్ నాయ‌క్` సంక్రాంతి కి రానుంద‌నే ఊహాగానాలొస్తున్నాయి. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది.  సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తోన్న `స‌ర్కారు వారి పాట`  ముందుగా సంక్రాంతి కి ఫిక్స్ అయింది. వాస్త‌వానికి ఈ సంవ‌త్స‌రంలోనే రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ ప‌రిస్థితుల్ని ముందుగానే  అంచ‌నా వేసి నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. అనూహ్యంగా ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ సంక్రాంతి 2022 బ‌రిలో ఫిక్స్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇంకా చాలా మంది అగ్ర హీరోలు స‌హా మీడియం హీరోలు కూడా సంక్రాంతి స‌మీపంలోనే రిలీజ్ కు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. డిసెంబ‌ర్ చివ‌రి నుంచి మొద‌ల‌య్యే సంక్రాంతి సీజ‌న్ జ‌న‌వ‌రి 20 వ‌ర‌కూ ఉంటుంది. ఈ లోపు చాలా చిత్రాలు బాక్సాఫీస్ పోటీ బ‌రిలో నిలిచే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.  క్రిస్మ‌స్ లేదా సంక్రాంతి 2022 కీల‌కం కానుంది. ఇక  `ఎఫ్-2`..  సీక్వెల్  `ఎఫ్ -3`,.. నాగార్జున‌ `బంగార్రాజు` కూడా  అదే సీజ‌న్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో  సంక్రాంతి కి రిలీజ్ అయిన `ఎఫ్‌-2`.. `సోగ్గాడు చిన్ని నాయ‌నా` చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ స్టామినాకి ఎదురే లేక‌పోయినా వ‌రుస‌గా అగ్ర హీరోల చిత్రాలు సంక్రాంతి రేస్ లోకి రావ‌డం హీట్ పెంచుతోంది. ముఖ్యంగా ప‌వ‌న్ - మ‌హేష్‌- ప్ర‌భాస్ ల న‌డుమ తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది.
Tags:    

Similar News