ట్రైలర్: 20 ఏళ్ల 'నువ్వు నాకు నచ్చావ్'..!

Update: 2021-09-06 15:53 GMT
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'నువ్వు నాకు నచ్చావ్'. విజయ్ భాస్కర్‌.కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తి అగర్వాల్‌ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ - మాటలు అందించగా.. కోటి సంగీతం సమకూర్చారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2001 సెప్టెంబరు 6న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల జాబితాలో చేరింది.

'నువ్వు నాకు నచ్చావ్' సినిమా విడుదలై నేటికి (సెప్టెంబరు 6) 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు, ఘన విజయం అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమాలోని కామెడీ - ఎమోషనల్ సన్నివేశాలతో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ - చంద్ర మోహన్ - సుహాసిని - పృథ్వీ - ఆశా షైనీ - బ్రహ్మానందం - ఎమ్మెస్ నారాయణ - సునీల్ - హేమ - సుధ - మల్లిఖార్జున రావు - బాబు మోహన్ - తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

'నువ్వు నాకు నచ్చావ్‌' సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలవడానికి ఇందులో కథ కథనాలతో పాటుగా వెంకటేష్ కామెడీ టైమింగ్‌ - ఆర్తి అగర్వాల్‌ అందాలు - దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌ - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ డైలాగ్స్ - కోటి సంగీతం ప్రధానాంశాలుగా నిలిచాయి. బ్రహ్మానందం - సునీల్‌ - ఎంఎస్ నారాయణ కామెడీ కూడా ఇందులో హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఫ్యామిలీతో కలిసి డైనింగ్ టేబుల్ వద్ద వెంకీ చేసే ప్రార్థన.. అమ్మపై ప్రకాశ్‌ రాజ్‌ చదివే కవిత ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా నవ్వు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్స్ సినిమాలో అనేకం ఉన్నాయి. ఇవన్నీ సినీ అభిమానులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి.

'నువ్వు నాకు నచ్చావ్‌' సినిమా 93 సెంటర్లలో 50 రోజులు.. 57 సెంటర్లలో 100 రోజులు.. మూడు కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఈ సినిమా ఎప్పుడు బుల్లితెరపై టెలికాస్ట్ అయినా మంచి టీఆర్పీ తెచ్చుకుంటుందంటేనే ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ కు ఉండే ఆదరణ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఈ కల్ట్ క్లాసిక్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ డిస్నీ + హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.


Full View
Tags:    

Similar News