వంగా - విజయ్.. మళ్ళీ కొత్త ట్రెండా?

తెలుగు సినిమాల్లో రీ రిలీజ్‌లు ఇప్పుడు కొత్త విషయం కాదు. పోకిరి, జల్సా, ఖుషి నుంచి ఎన్నో పాత సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చాయి.

Update: 2026-08-26 07:34 GMT

తెలుగు సినిమాల్లో రీ రిలీజ్‌లు ఇప్పుడు కొత్త విషయం కాదు. పోకిరి, జల్సా, ఖుషి నుంచి ఎన్నో పాత సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చాయి. ఒక దశలో అభిమానులు వీటికి భారీగా వెళ్లినా, ఈ ఏడాది కొన్ని రీ రిలీజ్‌లకు ఆ స్థాయి రెస్పాన్స్ కనిపించలేదు. అదే సినిమా, అదే సీన్లు మళ్లీ చూడాలనే ఉత్సాహం ప్రతిసారీ ఉండటం లేదు. ఇలాంటి టైమ్‌లో సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డితో మరో ట్రెండ్ లో ట్రై చేయాలని చూస్తున్నాడు.

2017లో వచ్చిన అర్జున్ రెడ్డి 2027తో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఆ సందర్భంగా సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని వంగా, విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా రోమంచకం ట్రైలర్ లో వంగా ఈ విషయాన్ని హైలెట్ చేశాడు. కానీ పాత కాపీని అలాగే తీసుకురావడం లేదట. అప్పట్లో ఎడిటింగ్ లో లేపేసిన సీన్స్ ను మళ్ళీ కలిపి ఎక్స్‌టెండెడ్ వెర్షన్ సిద్ధం చేయాలనేది ఆలోచిస్తున్నారు. విజయ్ రెండు మూడు రోజులు డబ్బింగ్ చెబితే సరిపోతుందని, తనకు మాత్రం దాదాపు 15 నుంచి 20 రోజుల పని ఉంటుందని వంగా చెప్పాడు. ప్రస్తుతం ఆ టైమ్ దొరకకపోవడంతో ప్లాన్ ఇంకా ముందుకు వెళ్లలేదు.

ఒకవేళం ఇదే జరిగితే ఈ ప్రయత్నం రెగ్యులర్ రీ రిలీజ్‌లకు కాస్త కొత్తగా ఉంటుంది. ఇప్పటికే చూసిన సినిమాను మంచి క్వాలిటీతో మళ్లీ చూపించడం ఒకటి. పదేళ్ల తర్వాత కొత్త సీన్లు, మార్చిన కట్‌తో అదే కథకు మరో వెర్షన్ ఇవ్వడం మరోటి. అర్జున్ రెడ్డికి ఇప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉండటంతో ఈ ప్రయోగానికి సరిపోయే సినిమా కూడా ఇదే.

పైగా రీ రిలీజ్ మార్కెట్‌లో ఇప్పుడు కొంత అలసట కూడా కనిపిస్తోంది. ప్రతి పాత సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తుండటంతో మొదట్లో ఉన్న కొత్తదనం తగ్గిందనే మాట ఇండస్ట్రీలో ఉంది. కొన్ని సినిమాలకు రీమాస్టరింగ్, పబ్లిసిటీ ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని గతంలో రిపోర్ట్స్ వచ్చాయి. అలాంటప్పుడు కొత్త కంటెంట్ జోడిస్తే ప్రేక్షకుడికి మళ్లీ థియేటర్‌కు రావడానికి ఒక కారణం ఉంటుంది.

ఇది వర్కవుట్ అయితే అర్జున్ రెడ్డి వరకే ఆగకపోవచ్చు. దర్శకుల దగ్గర రిలీజ్ కాకుండా మిగిలిపోయిన సీన్లు ఉన్న కల్ట్ సినిమాలకు ఎక్స్‌టెండెడ్ కట్ అనే మరో ఫార్ములా అందరికీ రావచ్చు. బర్త్‌డేకు పాత సినిమాను మళ్లీ వేయడం కాకుండా, కొత్త వెర్షన్ సిద్ధం చేసి రిలీజ్ చేసే ఆలోచన పెరగొచ్చు. అర్జున్ రెడ్డి పదో వార్షికోత్సవానికి ఈ ప్లాన్ నిజంగా పూర్తవుతుందా అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ వంగా 20 రోజులు కూర్చుని సినిమాను మళ్లీ రీవర్క్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి అతనికి ఆ గ్యాప్ ఎప్పుడూ దొరుకుతుంది అనేది చూడాలి. ఒకప్పుడు అర్జున్ రెడ్డితో కొత్త తరహా కథ చెప్పి ట్రెండ్ మార్చిన వంగా.. పదేళ్ల తర్వాత అదే సినిమాతో రీ రిలీజ్‌లకు కూడా కొత్త రూట్ చూపిస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News