తెలుగు TV రంగం AP వైపు రావాలంటే? 24 క్రాఫ్ట్స్‌తో FDC చర్చలు!
ఆంధ్రప్రదేశ్‌లో సినీ, టెలివిజన్ - నాటక రంగాలకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించే దిశగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినీ, టెలివిజన్ - నాటక రంగాలకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించే దిశగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ఎఫ్‌డీసీ (FDC) చర్యలు తీసుకుంటోంది. ఎఫ్‌డిసి చైర్మన్ భరత్ భూషణ్ అధ్యక్షతన ఈరోజు తెలుగు టెలివిజన్ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ సభ్యులు బుర్రా సాయి మాధవ్, మీర్, టీవీ అండ్ ఓటీటీ సౌత్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు, టీవీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే ఘనంగా అందజేస్తామని స్పష్టం చేశారు. 2017 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులను ఏ విధంగా ప్రదానం చేయాలనే దానిపై త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాకుండా 2025 సంవత్సరం నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నంది అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ వేడుకను ఏపీలోని తిరుపతి వేదికగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా టెలివిజన్ రంగానికి సంబంధించిన షూటింగ్‌లు.. వివిధ కార్యక్రమాలు కేవలం నామమాత్రంగా కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున జరిగేలా చూడాలని భరత్ భూషణ్ టీవీ రంగం పెద్దల్ని కోరారు. ఏపీలో షూటింగ్‌లు జరుపుకోవడం ద్వారా స్థానిక కళాకారులకు, టెక్నీషియన్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై టీవీ రంగ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ.. ఏపీలో షూటింగ్‌లు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అయితే ఏపీలో షూటింగ్‌ల నిర్వహణకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించాలని వారు ఎఫ్డీసీ చైర్మన్‌ను కోరారు. ఏపీలో టెలివిజన్ రంగానికి ప్రత్యేకంగా స్టూడియోల నిర్మాణం కోసం భూములు కేటాయించాలని.. స్థానిక ఆర్టిస్టులకు ప్రాధాన్యత కల్పించేలా ఇతర భాషల వారి వాడకాన్ని కొంతమేర క్రమబద్ధీకరించాలని విన్నవించారు. అలాగే టీవీ ఆర్టిస్టులు- కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య బీమా (ఇన్సూరెన్స్), పెన్షన్ సౌకర్యాలు కల్పించడం, షూటింగ్ ఖర్చులు తగ్గేలా సబ్సిడీలు అందించాలని వారు తమ డిమాండ్లను ముందుంచారు.
టెలివిజన్ రంగ ప్రముఖులు లేవనెత్తిన విజ్ఞప్తులపై భరత్ భూషణ్ సానుకూలంగా స్పందించారు. ఇవి ఏ ఒక్కరో అనుకుని నిర్ణయం తీసుకునే అంశాలు కానందున.. త్వరలోనే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పరిశ్రమకు, టీవీ రంగానికి - నాటక రంగ కళాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సహకారంతో టెలివిజన్ రంగాన్ని ఏపీలో మరింత అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశం ఒక మంచి వేదికగా నిలిచింది.