అన్వేష్ పై కేస్ ఫైల్.. నటి ఫిర్యాదుతో ఉత్కంఠ..
నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు వంటి యూట్యూబ్ ఛానల్స్ తో ఊహించని పాపులారిటీతో పాటు భారీ ఆదాయాన్ని.. లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు అన్వేష్..;
నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు వంటి యూట్యూబ్ ఛానల్స్ తో ఊహించని పాపులారిటీతో పాటు భారీ ఆదాయాన్ని.. లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు అన్వేష్.. ముఖ్యంగా విదేశాలను చుట్టేస్తూ అక్కడి విషయాలను అందరికీ తెలియజేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ఈయన ఈమధ్య కాలంలో నోటి దూల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా నిధి అగర్వాల్ లులూ మాల్ ఘటనపై నటుడు శివాజీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్న వేళ దీనిపై స్పందించిన అన్వేష్ అంతటితో ఆగకుండా ప్రవచనకర్త గరికపాటిపై సగటు తెలుగు వారు కూడా వినలేని అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ దూషించాడు.
అంతేకాదు హిందూ దేవీ, దేవత మూర్తులైన సీత, ద్రౌపదీలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మండిపడ్డ హిందూ సంఘాలు ఇతడి పై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గరికపాటి టీం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో అన్వేష్ కి తిప్పలు తప్పవు అనుకునేలోపే ఒక నటి ఫిర్యాదుతో ఇతడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం సంచలనంగా మారింది.
అసలు విషయంలోకెళితే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దేవీ దేవతలను దూషించారంటూ ప్రముఖ నటి కరాటే కళ్యాణి అన్వేష్ పై ఫిర్యాదు చేసింది. దీంతో బిఎన్ఎస్ లోని సెక్షన్ 352, 79, 299 లతోపాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. త్వరలోనే అన్వేష్ కు నోటీసులు కూడా పంపనున్నారు. త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే హిందూ దేవతలను దూషించాడనే కారణంతో ఇతడిని అన్ ఫాలో చేయాలని నెటిజన్స్ పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా 30 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న అన్వేష్ ను ఈ రెండు రోజుల్లోనే సుమారుగా 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అన్ ఫాలో అయ్యారు. అయినా సరే అన్వేష్ ఆగడాలు ఆగడం లేదు. దీనికి తోడు ఏకంగా ఇండియాని దూషిస్తూ అతడు చేస్తున్న వీడియోలు కూడా సగటు భారతీయుడికి విపరీతమైన కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. అతడు మాత్రం రోజుకొక వీడియో షేర్ చేస్తూ ఇలా అనుచితంగా వ్యాఖ్యలు చేయడంతోనే వెంటనే ఇతడిని ఇండియాకు పిలిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని అటు హిందూ సంఘాలు ఇటు ప్రేక్షకులు మండిపడుతున్నారు.