నట గురువు ఆర్థిక కష్టాలు: వేల కోట్ల ఇండస్ట్రీలో ఉన్నా బ్యాంకు ఖాతాలో రూ.400 లేదు!

సినీ ఇండస్ట్రీ అంటేనే క‌ల‌ల ప్రపంచం. బయటకు కనిపించే మెరుపుల వెనుక ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు దాగి ఉంటాయి.;

Update: 2026-04-20 04:28 GMT

సినీ ఇండస్ట్రీ అంటేనే క‌ల‌ల ప్రపంచం. బయటకు కనిపించే మెరుపుల వెనుక ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు దాగి ఉంటాయి. వందలాది చిత్రాల్లో నటించి.. న‌ట‌గురువుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అగ్ర నటుడు అనుపమ్ ఖేర్ జీవితం ఇందుకు ఒక పెద్ద నిదర్శనం. ప్రస్తుతం ముంబైలో అద్దె ఇంట్లో ఉంటూ సరళమైన జీవనాన్ని గడుపుతున్న ఆయన ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. వెండితెరపై కోట్లకు కోట్లు పారితోషికం అందుకునే స్థాయి నుండి.. తన బ్యాంక్ ఖాతాలో కనీసం ఐదు వందల రూపాయలు కూడా లేని దీన స్థితికి ఆయన చేరుకున్నార‌ట‌.

అనుపమ్ ఖేర్ ఆర్థిక కష్టాలకు ఒక ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంది. ఆయ‌న‌ నిర్మాతగా మారాలనే నిర్ణయమే ఈ ధైన్య స్థితికి ప్రధాన కారణం. నటుడిగా అపారమైన కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఉన్నా.. టెలివిజన్ ప్రొడ్యూసర్‌గా తనను తాను నిరూపించుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం భారీ నష్టాలను మిగిల్చింది. 2000 ఆరంభంలో ఆయన వ్యాపారపరంగా చేసిన తప్పులు ఆర్థికంగా దివాళా తీసే స్థాయికి తీసుకువెళ్లాయి. అగ్ర నటుడిగా అందరికీ సుపరిచితుడైన వ్యక్తి.. వ్యక్తిగత జీవితంలో ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నారని అప్పట్లో ఎవరూ ఊహించలేదు.

ఆర్థిక భారం ఎంతగా పెరిగిపోయిందంటే.. ఆయన నివాసముంటున్న ఇల్లు .. పని చేసే ఆఫీసు రెండూ బ్యాంకులో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఒక సందర్భంలో తన బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం రూ. 400 మాత్రమే మిగిలిందని ఆయన స్వయంగా వెల్లడించారు. ఉన్నత స్థితిలో ఉన్న ఒక నటుడు అద్దె కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది సినీ గ్లామర్ వెనుక ఉన్న చీకటి కోణాన్ని అద్దం పడుతోంది. అయితే అటువంటి కష్టకాలంలో కూడా ఆయన ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో శ్రమించి.. మళ్ళీ నటనపై దృష్టి సారించి తన పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారు.

ఆ కష్టాల నుండే ఆయన జీవిత సత్యాన్ని గ్రహించారు. అందుకే ముంబైలోని తన సొంత ఇంటిని నటి ఆలియా భట్‌కు విక్రయించి గత పదేళ్లుగా అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. జీవితం ఏ స్థాయిలోనైనా సింపుల్ గానే ఉంటుంది! అనేది ఆయన నమ్మకం. అనవసరమైన ఆస్తుల భారం... నిర్వహణ తలనొప్పులు లేకుండా ప్రశాంతంగా జీవించడమే ఉత్త‌మం అని ఆయన భావిస్తారు. ముంబైలో ఇల్లు లేకపోయినా.. తన తల్లి దులారి ఖేర్ కోరిక మేరకు సిమ్లాలో ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేసి తన బాధ్యతను నెరవేర్చారు.

అనుపమ్ ఖేర్ జీవిత ప్రస్థానం నేటి తరానికి ఒక గొప్ప సందేశం. ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నవారికైనా జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని.. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎంతటి వారైనా ఇబ్బందుల్లో పడతారని ఆయన ఉదంతం నిరూపిస్తోంది. భౌతిక ఆస్తుల కంటే మానసిక ప్రశాంతత.. కుటుంబ సభ్యుల సంతోషమే ముఖ్యమని ఆయన ప్ర‌యాణం చాటి చెబుతోంది. విలాసవంతమైన భవంతుల్లో ఉండటం కంటే.. సామాన్యంగా ఒత్తిడి లేని జీవితాన్ని జీవించడంలోనే అసలైన తృప్తి ఉందని నిరూపిస్తూ లెజెండ‌రీ న‌టుడు, న‌ట‌గురువు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.

Tags:    

Similar News