ఇండియన్ సినిమాకు అతడో మారాథాన్ మ్యాన్!
బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకులను కొన్ని దశాబ్దాలగా అలరిస్తున్నారు.;
బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకులను కొన్ని దశాబ్దాలగా అలరిస్తున్నారు. మూడు తరాల నటులతో కలిసి పనిచేసిన లెజెండ్. బాలీవుడ్ సహా ఇతర భాషల్లో కూడా తనదైన ముద్ర వేసారు. ఇప్పటికే నటుడిగా 549 చిత్రాలను దిగ్విజయంగా పూర్తి చేసారు. తాజాగా కొత్త ఏడాది సందర్భంగా 550వ చిత్రం కూడా పట్టాలెక్కించారు. `ఖోస్లా కా ఘోస్లా` చిత్రీకరణ న్యూ ఇయర్ సందర్భంగా ప్రారంభమైంది. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో ఉమేష్ బిస్ట్ తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఈ సందర్భంగా తన నటప్రస్తానాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ అంతర్జాతీయ దర్శకుడు అనుపమ్ చిత్రాల సంఖ్య, ఆయన నటన చూసి ఇండియన్ సినిమాకు తనని ఓ మారాథాన్ మ్యాన్ గా అభివర్ణించినట్లు చెప్పుకొచ్చారు. 550వ సినిమా మొదలు పెట్టినప్పుడు ఆ మాట గుర్తొచ్చి ఎంతో సంతోషానికి గురైనట్లు వెల్లడించారు. 1981 జూన్ 3వ తేదీన కలల నగరమైన ముంబైలో అడుగు పెట్టానన్నారు. అప్పట్లో ఇన్ని చిత్రాలు చేస్తానని..ఇంత గొప్ప మైలు రాయిని చేరుకుంటానని గానీ తానెంత మాత్రం ఊహించలేదన్నారు. ఓ సాధారణ వ్యక్తిలా పరిశ్రమకు వచ్చి నిరూపిం చుకోవడం చిన్న విషయం కాదన్నారు.
తనలో ఇంకా పని చేయాలి అన్న తపన ఎంత మాత్రం సన్నగిల్లలేదన్నారు. వయసు అన్నది కేవలం తనకు ఓ నెంబర్ మాత్రమేనని...అవకాశం ఉన్నంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటానన్నారు. తాను ఇన్ని సక్సెస్ లు సాధించడానికి కారణం దర్శక, నిర్మాతలు ఒక ఎత్తైతే..తనని అభిమానించిన ప్రేక్షకులు మరో కారణం అన్నారు. అనుపమ్ ఖేర్ జర్నీని ఉద్దేశించి దర్శకుడు సూరజ్ బర్జాత్యా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అనుపమ్ ఖేర్ వయసు 70 ఏళ్లు అయినా? ఆయన సినిమాలు చేసే స్పీడ్ చూస్తే ఆ వయసులో సగం వేగాన్ని చూపిస్తుం టారన్నారు. ప్రస్తుతం 549వ సినిమాను సూరజ్ బర్జాత్యా తెరెక్కిస్తున్నారు.
అనుపమ్ ఖేర్ తొలి సినిమాకు సూరజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. అదే నటుడిని డైరెక్ట్ చేసే అవకాశం ఇప్పటికీ లభించింది. టాలీవుడ్ ఆడియన్స్ కు అనుపమ్ ఖేర్ పరిచయమే. 1987లో `త్రిమూర్తులు` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు. చాలా కాలానికి నిఖిల్ హీరోగా తెరకెక్కిన `కార్తికేయ2 ` లో నటించారు. అనంతరం `టైగర్ నాగేశ్వరరావు`, `హరిహరవీరమల్లు` లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం మరో తెలుగు సినిమా `ఇండియా హౌస్` లోనూ నటిస్తున్నారు. ఇతర భాషల్లో కూడా అనుపమ్ ఱఖేర్ ప్రయాణం కొనసాగుతుంది. మాతృ భాషకే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేయడం పెద్దాయన ప్రత్యేకత.