'వేల్పారి' సెట్స్‌పైకి వెళ్లాలంటే ఈ చిక్కుముడి వీడాలి!

కానీ శంక‌ర్ వేల్పారిని స‌వ్యంగా పూర్తి చేయాలంటే, లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో త‌న సంబంధాలు ప‌ర్ఫెక్ట్ గా ఉండాలి. ఇండియ‌న్ 2 ఫెయిల్యూర్ త‌ర్వాత అత‌డు ఇండియ‌న్ 3 పెండింగ్ ప‌నుల్ని పూర్తి చేసి రిలీజ్ కి లైన్ క్లియ‌ర్ చేయాల్సి ఉంది.;

Update: 2026-03-16 03:00 GMT

వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత శంక‌ర్ `వేల్పారి` అనే భారీ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇది న‌వ‌లా ఆధారిత చిత్రం. దీనికోసం భారీ బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేయ‌డ‌మే గాక‌, శంక‌ర్ సుదీర్ఘ స‌మ‌యాన్ని కేటాయించాల్సి ఉంటుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే శంక‌ర్ స‌హ‌జంగానే రెండేళ్ల లోపు త‌న చిత్రాన్ని పూర్తి చేయ‌రు.

కానీ శంక‌ర్ వేల్పారిని స‌వ్యంగా పూర్తి చేయాలంటే, లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో త‌న సంబంధాలు ప‌ర్ఫెక్ట్ గా ఉండాలి. ఇండియ‌న్ 2 ఫెయిల్యూర్ త‌ర్వాత అత‌డు ఇండియ‌న్ 3 పెండింగ్ ప‌నుల్ని పూర్తి చేసి రిలీజ్ కి లైన్ క్లియ‌ర్ చేయాల్సి ఉంది. కానీ లైకా సంస్థ బ‌డ్జెట్ విష‌యంలో వెన‌కా ముందు ఆడుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అదే స‌మ‌యంలో శంక‌ర్, క‌మ‌ల్ హాస‌న్ ఇప్ప‌టికే అందుకున్న మొత్తం నుంచి కొంత పారితోషికాన్ని లైకాకు వెన‌క్కి ఇవ్వ‌డం ద్వారా బ‌డ్జెట్ కి స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఒక‌వేళ శంక‌ర్ ఇండియ‌న్ 3ని పూర్తి చేయ‌కుండా వేల్పారి చిత్రీక‌ర‌ణ‌కు వెళితే అత‌డిపై లైకా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. లైకాతో అత‌డికి చిక్కులు ఉన్నాయి. వాట‌న్నిటినీ ప‌రిష్క‌రించుకున్న త‌ర్వాతే శంక‌ర్ త‌న త‌దుప‌రి సినిమా తీయ‌డానికి వెళ్లాల్సి ఉంటుంద‌ని త‌మిళ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ ఇప్ప‌టికి ఊహాగానాలు మాత్ర‌మే. శంక‌ర్ కానీ లైకా కానీ అధికారికంగా ఈ విష‌యాల‌ను ధృవీక‌రించాల్సి ఉంటుంది.

మ‌రోవైపు శంక‌ర్ వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ల‌తో ప్ర‌యోగాలు చేసి విఫ‌ల‌మ‌య్యారు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న లైట్ వెయిట్ సినిమాలు తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో నిరూపించిన త‌ర్వాతే మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమా తీయాల‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ఒక‌వేళ అలా కాకుండా అత‌డిని న‌మ్మి భారీ బ‌డ్జెట్లు పెడితే గ్యారెంటీ ఏమిటనే సందేహం కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఇండియ‌న్ 2తో దిల్ రాజు వంటి నిర్మాత‌కు ఇలాంటి అనుభ‌వం అయింది. లైకా సంస్థ ఇప్ప‌టికే శంక‌ర్ కార‌ణంగా తీవ్ర న‌ష్టాల‌ను ఎదుర్కొంది. అందుకే ఇప్పుడు వేల్పారి విష‌యంలో నిర్మాత‌లు తెలివైన నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని కూడా విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి.

`వేల్పారి` కథాంశం ఏమిటి? ఏ నవల ఆధారంగా వస్తోంది?

ఈ చిత్రం తమిళంలో అత్యంత ప్రజాదరణ పొందిన `వేల్పారి` (వీర‌యుగ నాయ‌గ‌న్ వేల్పారి) అనే చారిత్రాత్మక నవల ఆధారంగా రూపొందుతోంది. దీనిని ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎస్. వెంకటేశన్ రాశారు. ఇది సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి సంగం కాలం నాటి కథ. పరంబు నాడును పాలించిన వీర సేనాధిపతి, దాతృత్వానికి మారుపేరైన వేల్పారి అనే గిరిజన రాజు జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రకృతిని ప్రేమించే వేల్పారికి అతడి భూమిని ఆక్రమించుకోవాలని చూసే చేర, చోళ, పాండ్య రాజుల (మువేందర్లు) మధ్య జరిగే భీకర పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం.

అంత బ‌డ్జెట్టా!

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.ఈ సినిమా బడ్జెట్ గురించి వింటేనే నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ చిత్రానికి సుమారు 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. దీనిని మూడు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది.

శంకర్‌ను నమ్మే పరిస్థితి ఉందా?

దర్శకుడు శంకర్ విషయంలో ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. శంకర్ నుంచి వచ్చిన 2.0 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. అలాగే భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజ‌ర్, భారతీయుడు 2 విమర్శకులు, ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. దీనివల్ల శంకర్ తన పాత వైభవాన్ని కోల్పోయారనే వాదన వినిపిస్తోంది. అయితే వేల్పారితో అత‌డి కంబ్యాక్ సాధ్య‌మ‌య్యేందుకు అవ‌కాశం ఉంద‌ని న‌మ్మేవారు లేక‌పోలేదు. వేల్పారి చిత్రంలో సూర్య లేదా యష్ వంటి స్టార్ హీరోలు నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. శంకర్ ఈ సినిమాతో తన సత్తా చాటితేనే ఆయన తదుపరి ప్రాజెక్టులకు ఛాన్సుంటుంది.

Tags:    

Similar News