బెస్ట్ ప్రొడ్యూసర్స్..మైత్రి అధినేత‌ల‌కు హ‌రీష్ కాంప్లిమెంట్

ఆదివారం సాయంత్రం జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ తన భావోద్వేగ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.;

Update: 2026-03-16 03:26 GMT

ఆదివారం సాయంత్రం జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ తన భావోద్వేగ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తనకు అందించిన సహకారాన్ని కొనియాడుతూ వారికి `బెస్ట్ ప్రొడ్యూసర్స్` అనే కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏ దర్శకుడికైనా వారు డ్రీమ్ ప్రొడ్యూసర్స్ అని, అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చి సినిమా అద్భుతంగా రావడానికి కారణమయ్యారని హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాతలు పెట్టిన పెట్టుబడి, శ్రమను ప్రశంసిస్తూ.. `కాలరే ఎత్తరా` పాట కోసం మైత్రి కెరీర్‌లోనే అతిపెద్ద సెట్‌ను ఆనంద్ సాయి అద్భుతంగా నిర్మించారని హరీష్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యానికి.. అలాగే వేగంగా పూర్తి కావడానికి తానే కారణమని బాధ్యత తీసుకున్నారు. నిర్మాతలు తనను భుజాల మీద మోసి, గుండెల్లో పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు.

సినిమా ఆలస్యం కావడంపై స్పందిస్తూ.. తొలుత `ఖుషి` చిత్రానికి కొనసాగింపుగా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు లెక్చరర్ల ఈగో చుట్టూ తిరిగే కథను అనుకున్నామని హరీష్ వెల్లడించారు. అయితే కొన్ని కారణాల వల్ల.. అలాగే కోవిడ్ ప్రభావంతో కథ మార్చాల్సి వచ్చిందని వివరించారు. ఈ ప్రయాణంలో రెండున్నరేళ్ల పాటు తనతోనే ఉండి సహకరించిన రచయిత దశరథ్‌తో పాటు రమేష్ రెడ్డి, ప్రవీణ్ వర్మ, చంద్రమోహన్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్లు శ్రీలీల, రాశీ ఖన్నా, దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా, అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రల్లో నటించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉగాది కానుకగా మార్చి 19న విడుదలవుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1200కు పైగా థియేటర్లలో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్ట్యా ప్రతి థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో విడుదలవుతోంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కలిపి మొత్తం 800కు పైగా స్క్రీన్లలో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ ఓపెనింగ్స్ సాధ్య‌మే:

తాజా స‌మాచారం మేర‌కు `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే థియేటర్లు `సోల్డ్ అవుట్` అవుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారానే ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును దాటి పవన్ కళ్యాణ్ స్టామినాను నిరూపిస్తోంది.

ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 70 కోట్ల నుండి 85 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే 45 కోట్ల నుండి 55 కోట్ల షేర్ రాబట్టి పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవవచ్చని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ గెటప్.. శ్రీలీల డ్యాన్స్‌లు .. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుండగా.. ఉగాది లాంగ్ వీకెండ్ సెంటిమెంట్ సినిమా కలెక్షన్లకు మరింత ప్లస్ కానుంది.

Tags:    

Similar News