మూడు నెల‌ల్లోనే రెండ‌వ భాగం రికార్డు!

కానీ `ధురంధర్` చిత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి భాగం విడుదలైన కేవలం మూడు నెలల వ్యవధిలోనే `ధురంధర్ 2` విడుదలకు సిద్ధమవ్వడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-03-16 03:15 GMT

సాధారణంగా సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ లేదా పార్ట్-2 రిలీజ్ అవ్వాలంటే? కనీసం రెండు నుండి మూడేళ్ల సమయం పడుతుంది. కథను సిద్ధం చేయడం, నటీనటుల డేట్స్ సర్దుబాటు చేయడం, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. కానీ `ధురంధర్` చిత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి భాగం విడుదలైన కేవలం మూడు నెలల వ్యవధిలోనే `ధురంధర్ 2` విడుదలకు సిద్ధమవ్వడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

భారతీయ సినీ చరిత్రలో ఏ భాషలోనూ ఇంత వరకు ఇలాంటి ఫాస్ట్ రిలీజ్ రికార్డు లేదు. `బాహుబలి`, `కేజీఎఫ్`, `పుష్ప` వంటి సినిమాల రెండో భాగాల కోసం ప్రేక్షకులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తే గానీ రిలీజ్ అవ్వ‌లేదు. కానీ ధురంధర్' మేకర్స్ ఆధిద్య ధ‌ర్ పక్కా ప్రణాళికతో రెండు భాగాలను దాదాపు ఒకే సమయంలో చిత్రీకరించడం వల్ల అసాధ్యమైన రికార్డు సుసాధ్యమైంది. హాలీవుడ్‌లో కూడా చాలా అరుదుగా జరిగే ఈ తరహా రిలీజ్ స్ట్రాటజీని మన భారతీయ దర్శకుడు అమలు చేయడం విశేషం.

ఇంత వేగంగా రిలీజ్ అవుతుందంటే ? దానికి కార‌ణం చిత్ర యూనిట్ అద్భుతమైన పనితీరు అనే చెప్పాలి. మొదటి భాగం షూటింగ్ జరుగుతున్నప్పుడే రెండో భాగానికి సంబంధించిన కీలక సన్నివేశాలను కూడా పూర్తి చేసేశారు. విజువల్ ఎఫెక్ట్స్ , ఎడిటింగ్ పనులను కూడా సమాంతరంగా నిర్వహించడంతో, కేవలం మూడు నెలల్లోనే అవుట్‌పుట్ సిద్ధమైంది. దీనివల్ల మొదటి భాగం చూసిన ప్రేక్షకుడికి ఆ కథపై ఉన్న ఆసక్తి తగ్గకుండానే, రెండో భాగాన్ని అందించే అవకాశం చిత్ర యూనిట్‌కు దక్కింది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టేందుకు ఒక వ్యూహాత్మక అడుగుగా చెప్పొచ్చు.

తక్కువ సమయంలో రిలీజ్ అవ్వ‌డం మాత్రమే కాదు. `ధురంధర్ 2` అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్‌కు పది రోజుల ముందే భారీ స్థాయిలో బుకింగ్స్ రాబట్టడం చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే. ఇది మొదటి భాగం కంటే రెండో భాగం మరింత పెద్ద విజయాన్ని అందుకోబోతుందా? అన్న దానికి సూచిక‌గా మారింది.. మూడు నెలల గ్యాప్‌లో రావడం వల్ల ప్రేక్షకుల్లో ఉన్న హైప్ అస్సలు తగ్గలేదు. పైగా రెండో భాగంపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ తరహా రిలీజ్ ప్లాన్ భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులకు మార్గదర్శకం కానుంది.

రెండు భాగాలు, సీక్వెల్స్ చేయాల‌నుకునే ద‌ర్శ‌కులు ఆదిధ్య ధ‌ర్ త‌ర‌హాలో స్క్రిప్ట్ ద‌శ‌లోనే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉండ‌గ‌ల్గితేనే ఇది సాధ్య‌మ‌వుతుంది. మ‌ధ్య‌లో నిర్న‌యాలు మారినా? మ‌రేం జ‌రిగినా? ఒకేసారి రెండు భాగాలు షూట్ చేయ‌డం అంత సుల‌భం కాదు. కంటెంట్ పై న‌మ్మ‌కం తో పాటు అంకిత భావం కూడా అంతే అవ‌స‌రం.

Tags:    

Similar News