స్టాండప్ కమెడియన్ అనుదీప్ కి బెయిల్ మంజూరు.. కానీ?
నిహారిక, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి సెలబ్రిటీలను టార్గెట్గా చేసుకొని స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల చేసిన కొన్ని కామెంట్లు పెను వివాదానికి దారి తీసాయి.;
సాధారణంగా కామెడీ అనేది ప్రేక్షకులను నవ్వించగలగాలే తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అన్న విషయం ఎప్పటికప్పుడు నిరూపణ అవుతూనే ఉంటుంది.. ముఖ్యంగా ఇతరులను టార్గెట్ గా చేసుకొని చేసే కామెడీ వల్ల కమెడియన్లు నష్టపోక తప్పదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని పంచులు వేసి ప్రేక్షకులలో మరిచిపోలేని ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఇక అన్నీ తెలిసినా కూడా ఒక స్టాండప్ కమెడియన్ మాత్రం వార్తలలో నిలవడానికో లేక తెలియక చేశారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ , నిహారిక వంటి మెగా కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మెగా అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ స్టాండప్ కమెడియన్ అనుదీప్.
అనుదీప్ కటికాలాకి బెయిల్ మంజూరు..
నిహారిక, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి సెలబ్రిటీలను టార్గెట్గా చేసుకొని స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల చేసిన కొన్ని కామెంట్లు పెను వివాదానికి దారి తీసాయి. ఇక మెగా అభిమానుల నుంచి నెటిజనుల వరకు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో అనుదీప్ పై కొన్నిచోట్ల కేసు కూడా నమోదయింది. దీంతో కాకినాడ పోలీసులు అనుదీప్ ను అరెస్టు చేశారు.. చివరికి బెయిల్ పై అనుదీప్ విడుదలవడం జరిగింది.. కానీ ఈ విడుదల విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
పదివేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు..
అసలు విషయంలోకి వెళ్తే.. వివాదం ముదురుతోందని గమనించిన అనుదీప్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్షమాపణలు చెప్పారు.. తన ఉద్దేశం ఎవరిని నొప్పించడం కాదని , కేవలం కామెడీ కోసం మాత్రమే అలా మాట్లాడాను అంటూ వివరణ కూడా ఇచ్చాడు. కానీ అతను చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాకినాడ పోలీసులు అరెస్టు చేసి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి బి శ్రీదేవి ముందు ఇతడిని హాజరు పరిచారు. రాత్రి 12 గంటల వరకు వాదనలు కొనసాగాయి. అయితే రూ.10,000 పూచీకత్తుతో అనుదీప్ ను బెయిల్ మీద విడుదల చేశారు. ఇక నిబంధనల ప్రకారం విచారణకు సహకరించాలని కూడా ఆదేశించారు.
కాకినాడలో ఊరట.. హైదరాబాద్లో తప్పని తిప్పలు..
కాకినాడలో బెయిల్ వచ్చినప్పటికీ హైదరాబాదులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మెగా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ కటికాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా దీనిపై స్పందించిన సజ్జనార్ కూడా వెంటనే విచారణ జరిపి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అటు అనుదీప్ కటికాలకి బెయిల్ వచ్చిన ఇక్కడ మరోసారి జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
హైదరాబాద్ కి చెందిన అనుదీప్ కటికాల ఇటీవల నిర్వహించిన ఒక షోలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అయినా రామ్ చరణ్ గురించి అలాగే నిహారిక విడాకుల గురించి చేసిన కామెంట్లు అందరినీ ఆగ్రహానికి గురిచేసాయి. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ నిహారిక విడాకుల విషయంలో పవన్ సలహా తీసుకోవచ్చని చేసిన జోకులు మెగా అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.