నాలుగు నెలలు ఉండగానే అనిల్ సందడి షురూ..!
సినిమా ప్రమోషన్‌లో భాగంగా అనిల్ రావిపూడి సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాట స్టిల్స్ ను లీక్ చేయించి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి 'జనవరి 12 విడుదల' సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మల్టీస్టారర్‌గా తెరకెక్కించి సక్సెస్ దక్కించుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను మల్టీస్టారర్‌గా రూపొందిస్తున్నాడు. వెంకటేష్‌తో పాటు తన మొదటి సినిమా హీరో కళ్యాణ్ రామ్‌ను ఈ సినిమాలో నటింపజేయడం వల్ల అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ ఫార్ములా వెంట నడుస్తున్నాడు. అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాకు ఏదో పెద్ద హంగామా చేయకుండా, హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా షూట్ చేస్తాడు. సినిమాను సైతం భారీ సెట్స్ లేకుండా, పెద్ద బడ్జెట్ కాకుండా సింపుల్‌గా, మీడియం రేంజ్‌లోనే తీస్తాడు. కానీ ప్రమోషన్ విషయంలో ఎక్కువ హంగామా చేస్తాడు. గత రెండు సినిమాలను అనిల్ రావిపూడి ఏ స్థాయిలో ప్రమోషన్ చేశాడో అందరికీ తెలిసిందే.
జనవరి 12 విడుదల అప్‌డేట్స్...
ప్రస్తుతం అనిల్ రావిపూడి చేస్తున్న 'జనవరి 12 విడుదల' సినిమా విషయంలోనూ అదే ఫార్ములా పాటించబోతున్నాడు. ఇప్పటికే సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం జంధ్యాల నుంచి మొదలుకుని ఎంతో మందిని వాడేశాడు. తన ఫేవరెట్ మూవీ అంటూ పాత మూవీ క్లిప్స్ వేసి ఈ సినిమాను ప్రమోట్ చేయడం అనిల్ రావిపూడికి చెల్లింది. షూటింగ్ ఆరంభం నుంచి సినిమా గురించి జనాల్లో చర్చ జరిగే విధంగా ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తున్నాడు. సినిమా విడుదలకు దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కనుక ప్రమోషన్ మొదలు పెట్టాడు. ఆ మద్య ఒక పాట షూట్ కి సంబంధించిన క్లిప్స్ బయటకు వచ్చాయి. దాంతో రెండు మూడు రోజులు సినిమా గురించి సోషల్ మీడియాలో హడావిడి కనిపించింది. పాటకు సంబంధించిన ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి అంటే యూనిట్ సభ్యుల నుంచి లీక్ అయ్యాయి అనే సమాధానం వినిపిస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి...
అనిల్ రావిపూడి ప్రమేయం లేకుండా ఆ లీక్ జరిగి ఉండదు అని కొందరు అంటున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా అనిల్ రావిపూడి సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాట స్టిల్స్ ను లీక్ చేయించి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అనిల్ రావిపూడి ప్రమోషన్ అగ్రెసివ్‌గా మారుతుంది. కనుక ఇప్పటి నుంచే ఆయన ప్రమోషన్ షురూ చేశాడని పాట షూట్ స్టిల్స్ లీక్ సందర్భంగా కొందరు అనుకున్నారు. అనిల్ రావిపూడి ప్రమోషన్‌తో సినిమాను ఏ స్థాయికి తీసుకు వెళ్తాడో అందరికీ తెలుసు. అయితే ఆయన సినిమా కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కనుక అందుకు తగ్గట్లుగా ప్రమోషన్ ఉండాలి. అందుకు తగ్గట్లుగా ప్రమోషన్ వీడియోలను ఇప్పటి నుంచే చిత్ర యూనిట్ సభ్యులతో, ముఖ్యంగా హీరోలు, హీరోయిన్స్‌తో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా...
సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం వార్తల్లో ఉండే విధంగా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగానే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ట్వీట్ చేశాడని కొందరు అంటున్నారు. ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్ ఎక్స్ లో సినిమా ఫస్ట్ హాఫ్ చూశాను, చాలా బాగుంది అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా రీ రికార్డింగ్ విషయమై సంగీత దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. జీవీ ప్రకాష్ కుమార్ స్పందించడంతో జనాల్లో సినిమా గురించి చర్చ మళ్లీ జరుగుతుంది. అలా ఏదో ఒక అంశంతో సినిమా గురించి చర్చ జరిగేలా, సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అయ్యేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి సినిమా సమయంలో అనిల్ రావిపూడి కి ఈ సినిమాతో గట్టి దెబ్బ తప్పదు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తూ ఉంటాయి. కానీ ప్రతిసారి అనిల్ రావిపూడికి సక్సెస్ దక్కుతుంది. అది కూడా రికార్డ్‌లు బద్దలు అయ్యే విధంగా హిట్ లు నమోదు అవుతున్నాయి.