'మోక్షు' గురించి అనిల్ రావిపూడి నోట ఆ మాట!

మాస్ మహారాజా రవితేజ నటించిన `ఇరుముడి`చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి గ్రాండ్ స‌క్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2026-09-11 04:34 GMT

మాస్ మహారాజా రవితేజ నటించిన `ఇరుముడి`చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి గ్రాండ్ స‌క్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దర్శకుడు శివ నిర్వాణతో ఉన్న అనుబంధాన్ని.. అలాగే రవితేజ కుమార్తె మోక్షుతో తనకు ఉన్న ప్రత్యేకమైన బాండింగ్‌ను అనిల్ రావిపూడి గుర్తుచేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య ఒక మంచి సోదరభావం ఉందని చెప్పారు. సినిమా దర్శకుల జీవితం సక్సెస్- ఫెయిల్యూర్ల మధ్య ఎంతో ఒత్తిడితో సాగుతుందని.. ఒక విజయం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. `ఇరుముడి` సినిమా విజయం కోసం శివ పడిన తపనను.. పెట్టిన ఎఫర్ట్స్‌ను తాను దగ్గరుండి చూశానని...ఈ సక్సెస్‌కు శివ పూర్తిగా అర్హుడని కొనియాడారు. అలాగే ఈ సినిమా స‌క్సెస్ జ్ఞాపకంగా శివ తన భార్యాపిల్లలతో కలిసి సినిమాలో చూపించిన గెటప్‌లో ఒక ఫొటో తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే అది జీవితాంతం గుర్తుండిపోతుందని సూచించారు.

ఒక భక్తిరస (డివోషనల్) అంశాన్ని థ్రిల్లర్ జోనర్‌కు జోడించి శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందంటూ అనిల్ రావిపూడి అభినందించారు. ఈ సినిమా చూసిన తర్వాత తనకు కూడా బాగా నచ్చిందని... భవిష్యత్తులో తాను కూడా ఇలాంటి ఒక వైవిధ్యమైన జోనర్‌ను ప్రయత్నించడానికి శివ నిర్వాణనే స్ఫూర్తి అని బహిరంగంగా ప్రకటించారు. సినిమాలోని ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా తీర్చిదిద్దడంలో శివ సఫలమయ్యారని అనిల్ ప్రశంసించారు.

అనంతరం మాస్ మహారాజా రవితేజ కుమార్తె మోక్షు (మోక్షదా) గురించి అనిల్ రావిపూడి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. తాను రవితేజతో `రాజా ది గ్రేట్` సినిమా తీస్తున్నప్పటి నుంచే మోక్షు- మహాదన్‌లు తనకు సొంత ఫ్యామిలీ మెంబర్స్‌లా మారిపోయారని తెలిపారు. తాను తీసే ప్రతి సినిమా విడుదలైన రోజే ఉదయాన్నే మోక్షు తనకు ఫోన్ చేసి `గురువుగారు కొట్టేశారు` అంటూ ఎంతో ఉత్సాహంగా శుభాకాంక్షలు చెబుతుందని గుర్తుచేసుకున్నారు.

అలాగే రవితేజకి ఒక సాలిడ్ హిట్ పడిన రోజున తాను మోక్షుకి రివర్స్‌లో ఫోన్ చేసి `శిష్య కొట్టేసావ్` అని చెప్పాలని చాలా కాలంగా వేచి చూస్తున్నానని.. ఈ `ఇరుముడి` సక్సెస్ చూసి ఆమెకు అదే మాట ఫోన్ చేసి చెప్పానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం మోక్షు కూడా చాలా కష్టపడిందని చెబుతూ.. సినిమాలో ``ఏం జరిగినా వెళ్లి నాన్నకి చెప్పాలి`` అనే డైలాగ్ తరహాలోనే.. రానున్న‌ రోజుల్లో మోక్షు నాన్నతోనే ఉంటూ రవితేజతో ఇలాంటి మరిన్ని బ్లాక్‌బస్టర్ విజయాలను అందిస్తూ ఉండాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News