జూన్‌లో స్టార్ట్.. సంక్రాంతికి బ్లాస్ట్!

టాలీవుడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-24 16:30 GMT

టాలీవుడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ద‌గ్గుబాటి వెంక‌టేష్, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జూన్ నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటివరకు తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అనిల్ రావిపూడి, ఈసారి కూడా తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌ను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

అనిల్ సినిమాల‌న్నీ హిట్లే!

కామెడీ, యాక్షన్ అంశాలను సమతుల్యంగా మేళవిస్తూ, ప్రేక్షకులను నవ్విస్తూ ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్‌ను రెడీ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆయన ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ప‌టాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, F3, సరిలేరు నీకెవ్వరు, భ‌గవంత్ కేస‌రి, మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో, ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

హీరోయిన్ గా కీర్తి సురేష్

ఇక ఈ మూవీలో హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మరో హీరోయిన్ కోసం మేకర్స్ ఇంకా వేట కొనసాగిస్తున్నారని, కథకు సరిపోయే సరైన కాంబినేషన్ కోసం పలు ఆప్షన్లను పరిశీలిస్తున్నారని సమాచారం.

జూన్ లో షూటింగ్

ప్రొడక్షన్ పరంగా కూడా ఈ సినిమా అనిల్ గ‌త సినిమాల్లానే వేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో షూటింగ్ ను ప్రారంభించి, ఈ ఇయ‌ర్ ఎండింగ్ నాటికి మొత్తం షూటింగ్ ను ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ ను కూడా ఫాస్ట్ ట్రాక్‌లో పూర్తి చేయాల‌ని చూస్తున్నార‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేసి, 2027 సంక్రాంతి సందర్భంగా మూవీని విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

అస‌లే సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద సినిమాల పోటీకి వేదిక. అలాంటి టైమ్‌లో మల్టీస్టారర్ ఎంటర్టైనర్ రావడం బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్‌కు దారితీయవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా అనిల్, వెంకీ కాంబోలో సంక్రాంతికి సినిమా వ‌స్తే దాని రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌నేది ఆల్రెడీ సంక్రాంతికి వ‌స్తున్నాంతో చూశాం. ఇప్పుడు మ‌రోసారి సంక్రాంతికి ఈ కాంబో వ‌స్తే మ‌రిన్ని రికార్డులు సాధించ‌డం ఖాయం.

Tags:    

Similar News