రామ్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'.. మిస్ అయితే అంతే సంగతి!
టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యాన్ బయోపిక్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మహేష్ బాబు తెరకెక్కించిన ఆ సినిమా.. నవంబర్ 28వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.
అయితే సినిమాకు రివ్యూస్ పాజిటివ్ గానే వచ్చాయి. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాకే వచ్చింది. సినిమా బాగుందని అనేక మంది క్రిటిక్స్ చెప్పారు. ప్రశంసలు కూడా కురిపించారు. కానీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపించలేదు. మోస్తరు కలెక్షన్స్ మాత్రమే ఆంధ్రా కింగ్ తాలూకా సాధించింది.
రిలీజ్ అయ్యి వారం అయినా.. టాక్ బాగున్నా.. కలెక్షన్స్ మాత్రం లేకపోవడంతో మేకర్స్ నిరాశ చెందారనే చెప్పాలి. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చింది కదా.. రెండో వారం పికప్ అవుతుందనుకున్నా.. అఖండ 2: తాండవం రిలీజ్ ఉండడంతో హోప్స్ అంతగా పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా అఖండ సీక్వెల్ రిలీజ్ వాయిదా పడింది.
దీంతో ఇది ఆంధ్రా కింగ్ తాలుకాకు మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాను ఇప్పటికే ప్రదర్శించిన చాలా స్క్రీన్స్.. అఖండ-2 కోసం ఖాళీ చేశారు. కానీ ఇప్పుడు ఆ మూవీ వాయిదా పడడంతో మళ్లీ అందులో ఆంధ్రా కింగ్ తాలూకాను ప్రదర్శించే అవకాశం కచ్చితంగా ఉంది. దీంతో వసూళ్లు పెరిగే స్కోప్ ఉందని చెప్పాలి.
భారీ వసూళ్లు వచ్చేస్తాయని ఇప్పుడు చెప్పలేకపోయినా.. వీకెండ్ లో మాత్రం సందడి కనిపిస్తుంది. కానీ అలా జరగాలంటే.. పోస్ట్ ప్రమోషన్స్ తో మేకర్స్ ఫుల్ గా సందడి చేయాలి. ఆడియన్స్ ను తమవైపు మళ్లీ తిప్పుకోవాలి. సరికొత్త ప్లాన్ తో ముందుకు రావాలి. అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్.. సినిమా వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది.
కానీ ఇప్పుడు అఖండ 2 వల్ల వచ్చిన ఛాన్స్ ను వృథా చేసుకుంటే మాత్రం అంతే సంగతి. ఇంకా మరో అవకాశం కూడా రాదు. ఎందుకంటే వచ్చే వారం అనేక సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. అఖండ-2 కూడా తన సమస్యలను క్లియర్ చేసుకుని వచ్చేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లు ఆంధ్రా కింగ్ వసూళ్లు రాబట్టాలంటే ప్రమోషన్స్ ముఖ్యం. మరేం జరుగుతుందో వేచి చూడాలి.