గల్లీ బాయ్ లాంటి సినిమా.. 'అమీర్ లోగ్' గుట్టు విప్పిన డైరెక్టర్!

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా థియేటర్లలోకి వస్తున్న చిన్న చిత్రం ‘అమీర్ లోగ్’. మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.

Update: 2026-08-17 14:57 GMT

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా థియేటర్లలోకి వస్తున్న చిన్న చిత్రం ‘అమీర్ లోగ్’. మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో డైరెక్టర్ రమణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన చాలా విషయాలను తెలియజేశారు.

నల్గొండ జిల్లా నుంచి చదువు కోసం హైదరాబాద్ వచ్చిన తాను 20 ఏళ్లుగా ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్నానని రమణా రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ టైమ్ లో సొంత ఊరికి వెళ్లినప్పుడు ఓటీటీలో బాగా సినిమాలు చూశానని చెప్పారు. ఆరేడేళ్ల క్రితమే తన అనుభవాలతో కథలు రాయడం మొదలుపెట్టానని, స్నేహితుల ద్వారా అలాగే యూట్యూబ్ చూసి కథలు ఎలా రాయాలో నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు.

మూడేళ్ల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు ఆయన చెప్పారు. ఒక పాడ్ కాస్ట్ లో మనోజ్ బాజ్ పాయ్ అమీర్ లోగ్ అనే పదం వాడటం విని దాన్ని టైటిల్ గా పెట్టుకున్నానని తెలిపారు. ఆ తర్వాత ఒక బస్తీ అందులో ఉండే ముగ్గురు కుర్రాళ్ల నేపథ్యంతో రెండేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశానని దర్శకుడు వివరించారు.

బస్తీ వాతావరణం తెర మీద సహజంగా కనిపించడం కోసం ఏకంగా 38 రోజుల పాటు రియల్ బస్తీలోనే షూటింగ్ చేశామని అన్నారు. డబ్బింగ్ చెబితే ఆ నాచురల్ ఫీల్ పోతుందనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు సింక్ సౌండ్ వాడినట్లు చెప్పారు. నైట్ టైమ్ షూటింగ్స్ వల్ల బస్తీ వాళ్లు కొంచెం ఇబ్బంది పడినా సినిమా బాగా రావడానికి సింక్ సౌండ్ చాలా హెల్ప్ అయిందని అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాలో పక్కా హైదరాబాదీ యాస ఉంటుందని అందులో తెలుగు ఉర్దూ పదాలు కలిసి ఉంటాయని రమణా రెడ్డి చెప్పారు. భాష కంటే సీన్ లోని ఎమోషన్ అందరికీ ఈజీగా అర్థమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానా స్పిరిట్ టీమ్ కు సినిమా చూపించినప్పుడు వాళ్లు సెకండాఫ్ చూసి చాలా సంతోషించారని, రానా తన వంతుగా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారని డైరెక్టర్ తెలిపారు.

సినిమా చూసిన ఇండస్ట్రీ వాళ్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య ఈ చిత్రాన్ని చూసి అమితాబ్ ఝుండ్, రణ్ వీర్ సింగ్ గల్లీ బాయ్ లాంటి సినిమాలతో పోల్చారని చెప్పారు. రైటింగ్ అద్భుతంగా ఉందని ఆయన ఇచ్చిన ప్రశంసను తాను ఎప్పటికీ మర్చిపోలేనని డైరెక్టర్ రమణా రెడ్డి గుర్తు చేసుకున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ ను ఒక దావత్ పాట అడిగితే సినిమా చూసి ఏకంగా పది పాటలు ఇచ్చారని ఆయన చెప్పారు. ఇందులో కీరవాణి పాడిన పాట దశాబ్దాల పాటు నిలిచిపోతుందని తెలిపారు. సెన్సార్ వాళ్లు నాలుగైదు చోట్ల మ్యూట్స్ చెప్పారని, ఆర్టిస్టులకు ఫ్రీడమ్ ఇవ్వడంతో సెట్స్ లోనే కొన్ని డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసుకున్నారని వివరించారు. ఫైనల్ గా ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన నమ్మకంగా చెప్పారు.

Tags:    

Similar News