బాలయ్య కోసం ఐకాన్ స్టార్, సీఎం రేవంత్.. గెట్ రెడీ
డిసెంబర్ 5న రిలీజ్ కానున్న 'అఖండ 2: తాండవం' కోసం మేకర్స్ భారీ స్కెచ్ వేశారు. అయితే సినిమా కంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది.;
నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ జాతర. అందులోనూ 'అఖండ' లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ వస్తుందంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న 'అఖండ 2: తాండవం' కోసం మేకర్స్ భారీ స్కెచ్ వేశారు. అయితే సినిమా కంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ వేదికపై జరగబోయే ఒక అరుదైన కలయిక ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
హైదరాబాద్ లో జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కు ఇద్దరు పవర్ ఫుల్ గెస్ట్ లు రాబోతున్నారని సమాచారం. ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా, మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరూ ఒకే స్టేజ్ మీద కనిపించనుండటమే ఇప్పుడు అసలైన ట్విస్ట్. గతంలో 'పుష్ప 2' రిలీజ్ సమయంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల వీరి మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చిందని, ఒక రకమైన కోల్డ్ వార్ నడిచిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు బాలయ్య బాబు సాక్షిగా ఆ గ్యాప్ తొలగిపోనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నిజానికి అల్లు అర్జున్ కి, 'అఖండ' ఫ్రాంచైజీకి ఒక సెంటిమెంట్ లింక్ ఉంది. 2021లో 'అఖండ' మొదటి భాగం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా బన్నీనే చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ, సీక్వెల్ కి కూడా ఆయన్నే ఆహ్వానించారు మేకర్స్. ఆనాడు "జై బాలయ్య" అంటూ బన్నీ చేసిన సందడి ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
ఇక బాలకృష్ణ, అల్లు అర్జున్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆహాలో వచ్చే 'అన్ స్టాపబుల్' షోలో వీరిద్దరూ చేసిన రచ్చ చూశాక, వారి మధ్య ఎంత ఫ్రెండ్లీ రాపో ఉందో ఆడియన్స్ కు అర్థమైంది. ఏజ్ గ్యాప్ ఉన్నా సరే, "బ్రో" అనుకునేంత చనువు వీరి సొంతం. ఇప్పుడు అదే చనువుతో బాలయ్య పిలవగానే, బన్నీ మరోసారి స్టెప్పులేయడానికి రెడీ అయిపోయారు.
ఈ ఈవెంట్ కేవలం గెస్ట్ లతోనే కాదు, విజువల్ గా కూడా గ్రాండ్ గా ఉండబోతోంది. భారీ లైటింగ్ సెటప్, వేలాది మంది అభిమానుల మధ్య ఈ వేడుకను నిర్వహించనున్నారు. మరోవైపు నవంబర్ 21 బెంగళూరు దగ్గరలోని చిక్కబళ్లాపూర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. అక్కడ శివరాజ్ కుమార్ గెస్ట్ గా వస్తున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ బాలయ్య ప్రమోషనల్ మోత మోగిస్తున్నారు.
'అఖండ 2' ఈవెంట్.. అటు పొలిటికల్ గా, ఇటు సినిమాటిక్ గా ఒక స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. ఇక డిసెంబర్ 5న థియేటర్లలో శివతండవం చూడటానికి ఫ్యాన్స్ ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి అ సినిమా ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.