రాకా.. ఏడాది ముందే మొదలయ్యే ప్లాన్
నార్మల్ గా పెద్ద సినిమాల ప్రమోషన్స్ రిలీజ్‌కు రెండు మూడు నెలల ముందు స్పీడ్ పెంచుతాయి.
నార్మల్ గా పెద్ద సినిమాల ప్రమోషన్స్ రిలీజ్‌కు రెండు మూడు నెలల ముందు స్పీడ్ పెంచుతాయి. కానీ అల్లు అర్జున్, అట్లీ ‘రాకా’ విషయంలో మాత్రం చాలా ముందుగానే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినిమా థియేటర్లలోకి రావడానికి దాదాపు ఏడాది ముందు నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టాలని టీమ్ భావిస్తోందట. ముంబైకి చెందిన పీఆర్ ఏజెన్సీతో అల్లు అర్జున్ స్వయంగా కూర్చొని ఈ ప్లాన్ సిద్ధం చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఫాలోయింగ్ వచ్చింది. అట్లీకి ‘జవాన్’ తర్వాత నార్త్‌లో మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఒక్క తెలుగు, తమిళ ప్రమోషన్స్‌తో సరిపెట్టే పరిస్థితి ఉండదు. హిందీ మార్కెట్‌తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమా పేరు ముందుగానే జనాల్లో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఏడాది ప్రమోషన్ అంటే ప్రతివారం ఒక పోస్టర్ వదిలేయడం కాదు. పెద్ద సినిమాకు అంత కంటెంట్ కూడా ఉండదు. మొదట కాంబినేషన్, తర్వాత లుక్, కాస్టింగ్, షూటింగ్ అప్డేట్స్, మధ్యలో ఏదైనా స్పెషల్ వీడియో ఇలా గ్యాప్‌తో ఒక్కో విషయం బయటకు తీసుకురావచ్చు. రిలీజ్ దగ్గరికి వచ్చాక పాటలు, టీజర్, ట్రైలర్‌కు స్పేస్ ఉంటుంది. మొత్తం కంటెంట్‌ను మూడు నెలల్లోనే ఖర్చు చేయకుండా ముందే ప్లాన్ చేసుకోవచ్చు.
అల్లు అర్జున్‌కు ఈ విషయంలో ‘పుష్ప 2’ అనుభవం కూడా ఉంది. ఆ సినిమాకు హిందీ బెల్ట్‌లో ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేశారు. పాటలు, ట్రైలర్, ఈవెంట్స్ ఒక్కో మార్కెట్‌ను టార్గెట్ చేశాయి. ఇప్పుడు ‘రాకా’కి మొదటి నుంచే పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం ప్లాన్ చేస్తే, చివరి నెలలో అన్ని ప్రాంతాలు తిరగాల్సిన ఒత్తిడి కొంత తగ్గుతుంది.
పైగా ‘రాకా’ చిన్న సినిమా కాదు. అట్లీ సినిమాల్లో కాస్టింగ్ నుంచి టెక్నికల్ టీమ్ వరకు ఒక్కో అప్డేట్ కూడా ముందే వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కొత్త లుక్, సినిమాలోని ఇతర నటీనటులు, మ్యూజిక్ నుంచి వచ్చే మొదటి పాట వరకు ప్రతి దానికీ విడిగా హైప్ తెచ్చే అవకాశం ఉంది. అందుకే రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చాక ఒక్కసారిగా అన్నీ వదలడం కంటే, ఏడాది పాటు ఒక్కో కార్డ్ బయటకు తీసే ప్లాన్ కనిపిస్తోంది.
ఇప్పుడు అసలు పాయింట్ ఈ క్యాంపెయిన్ ఎప్పుడు మొదలవుతుందన్నదే. ఇప్పటికే ‘రాకా’ టైటిల్‌తో పాటు అల్లు అర్జున్‌ను హ్యూమన్ బీస్ట్ తరహా వైల్డ్ లుక్‌లో పరిచయం చేశారు. ఇక తర్వాత మరో క్యారెక్టర్ లుక్ వస్తుందా, కాస్టింగ్ నుంచి ఏదైనా పెద్ద పేరు బయటకు తీసుకొస్తారా, లేక షూటింగ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియో ప్లాన్ చేస్తారా అన్నది చూడాలి.