శక్తిమాన్ సినిమా.. మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది!
పుష్ప సిరీస్ ఘన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అమాంతం పెరిగింది.;

పుష్ప సిరీస్ ఘన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అమాంతం పెరిగింది. ఆయనతో సినిమా తీయాలనే ఉత్సాహంతో పలు భాషల దర్శకులు వరుసగా కలుస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కి బన్నీ ఓకే చెప్పగా, మరోవైపు కొందరు మలయాళ దర్శకులతో కూడా కథల చర్చలు జరుగుతున్నాయి.
ఇలాంటి సమయంలో ప్రముఖ మలయాళ దర్శకుడు బేసిల్ జోసెఫ్ బన్నీని కలిసినట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఓ సైన్స్ ఫిక్షన్ ఆధారిత కథను వినిపించాడట. బన్నీకి కథ నచ్చడంతో చర్చలు కొనసాగుతున్నాయనీ, ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో బన్నీ ‘శక్తిమాన్’గా కనిపించనున్నాడనే వార్తలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కానీ లేటెస్ట్ గా ఈ వార్తలపై దర్శకుడు బేసిల్ జోసెఫ్ స్పందించారు. ‘‘శక్తిమాన్ ప్రాజెక్ట్‌ను ఎవ్వరూ చేయడంలేదు. అది చేస్తే రణవీర్ సింగే చేస్తాడు. ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలే’’ అని బేసిల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో బన్నీ ‘శక్తిమాన్’ చేస్తాడన్న ప్రచారానికి ముగింపు పలికినట్టయింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ విజువల్ వండర్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్‌తో మరో మైథలాజికల్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఉండనుందని కూడా ప్రచారం ఉంది.
గతంలో ‘శక్తిమాన్’ ప్రాజెక్ట్ కోసం రణవీర్ సింగ్‌కి కూడా చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అల్లు అర్జున్ పేరు ఈ ప్రచారంలోకి లాగబడటమే తప్ప, ప్రాజెక్ట్‌తో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని బేసిల్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. మొత్తంగా చూస్తే బన్నీ సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ కాన్సెప్ట్‌లపై దృష్టి పెట్టినప్పటికీ, శక్తిమాన్ ప్రాజెక్ట్ మాత్రం ఆయన చేయడం లేదని అధికారికంగా తేలిపోయింది. ఇప్పుడు బన్నీ ఫోకస్ మొత్తం అట్లీ సినిమా మీదే ఉండనుంది. మరోవైపు బేసిల్ చెప్పిన కథ బన్నీకి నచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ మొదలయ్యేనా లేదా అనేది కాలమే చెప్పాలి.