అట్లీ అసలు చాన్స్ ఇవ్వట్లేదుగా..

ఇదే విషయంపై ఎస్‌కేఎన్‌ను అడిగినప్పుడు తన దగ్గర అసలు సమాచారం లేదని చెప్పారు.

Update: 2026-08-23 03:15 GMT

అల్లు అర్జున్ అట్లీ రాకా సినిమా మొదలైనప్పటి నుంచే బజ్ ఉహించని స్థాయిలో ఉంది. బన్నీ ‘పుష్ప 2’ తర్వాత చేస్తున్న సినిమా కావడం ఒక కారణం అయితే, అట్లీ కూడా ‘జవాన్’ తర్వాత మళ్లీ పెద్ద స్టార్‌తో వస్తుండటం మరో కారణం. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నా సెట్స్ నుంచి అసలు సమాచారం మాత్రం చాలా తక్కువగా బయటకు వస్తోంది. షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, బన్నీ లుక్ ఎలా ఉంది, ఏ సీన్ చేస్తున్నారు అన్నదానిపై కూడా క్లియర్ అప్డేట్స్ పెద్దగా లేవు.

ఇదే విషయంపై ఎస్‌కేఎన్‌ను అడిగినప్పుడు తన దగ్గర అసలు సమాచారం లేదని చెప్పారు. రోజూ సెట్స్‌కు దగ్గరగా ఉండే బన్నీ వాస్, శరత్ దగ్గరే వివరాలు ఉంటాయని అన్నారు. బన్నీ క్యాంప్‌కు దగ్గరగా ఉండే వ్యక్తే ఇలా చెప్పడం చూస్తే ‘రాకా’ విషయంలో టీమ్ సమాచారం బయటకు వెళ్లకుండా గట్టిగానే జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి అట్లీ సినిమాల దగ్గర ఇలాంటి సైలెన్స్ ఎప్పుడూ ఉండదు. ఆయన సినిమా అంటే కాస్టింగ్ నుంచి హీరో లుక్ వరకు ఏదో ఒక విషయం ముందే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ‘జవాన్’ టైమ్‌లో కూడా షారుక్ లుక్స్, నయనతార పాత్ర, విజయ్ సేతుపతి క్యారెక్టర్ గురించి రిలీజ్‌కు ముందే చాలానే ప్రచారం జరిగింది. ఈసారి మాత్రం ‘రాకా’ సెట్స్ నుంచి అలాంటి లీకులు చాలా తక్కువగా ఉన్నాయి.

దానికి కారణం సినిమా స్కేల్ కూడా కావచ్చు. ‘రాకా’ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ ఏ లుక్‌లో కనిపిస్తాడు, కథ ఏ జోన్‌లో ఉంటుంది, అట్లీ ఈసారి ఎంత పెద్ద ప్రపంచం సృష్టిస్తున్నాడు అన్నదే అసలు హైలెట్. ఇలాంటి విషయాలు ముందే బయటకు వస్తే ఫస్ట్ లుక్ లేదా టీజర్ ఇచ్చే సర్ప్రైజ్ తగ్గిపోతుంది. అందుకే టీమ్ అవసరమైన వాళ్ల దగ్గరే సమాచారం ఉంచుతున్నారా అనే మాట వినిపిస్తోంది.

మరోవైపు ఇప్పుడు పెద్ద సినిమాలకు సెట్స్ లీకులు కూడా చిన్న సమస్య కాదు. ఒక ఫొటో బయటకు వస్తే దాని మీదే కథలు, పాత్రలు, ట్విస్టులు ఊహించడం మొదలవుతోంది. కొన్ని సందర్భాల్లో అసలు సినిమా కంటే బయట ప్రచారం ఎక్కువైపోతుంది. అందుకే ‘రాకా’ టీమ్ ముందే కట్టడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. బన్నీ లుక్ కూడా ఇప్పటివరకు పూర్తిగా బయటకు రాకపోవడం అదే లెక్కలో చూడొచ్చు.

ఇప్పటికైతే ‘రాకా’ గురించి బయటకు వస్తున్న సమాచారం కంటే దాచిపెడుతున్నదే ఎక్కువగా ఉంది. ఎస్‌కేఎన్ మాటలతో అది మరింత క్లియర్ అయింది. అట్లీ ఈసారి షూటింగ్ పూర్తయ్యే వరకు చాలా విషయాలు బయటకు రానివ్వకుండా చూసుకుంటున్నారా అన్న ఆసక్తి పెరిగింది. ఇక టీజర్ వచ్చినప్పుడు ఇప్పటివరకు దాచినదంతా ఒకేసారి చూపిస్తారా అన్నదే చూడాలి.

Tags:    

Similar News