30 ఏళ్ల ప్రయాణం: పవన్ కళ్యాణ్‌కు బాస్ అల్లు అరవింద్ సర్‌ప్రైజ్
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల కాలం ఇంత త్వరగా గడిచిపోయిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలను అభినందిస్తూ.. ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సినిమాలకే పరిమితం కాకుండా సమాజం పై పవన్ కళ్యాణ్‌కు ఉన్న దూరదృష్టిని కూడా అల్లు అరవింద్ ప్రశంసించారు. సినిమా రంగం వెలుపల కూడా ఆయన చేస్తున్న సేవలను, సమాజం కోసం అందిస్తున్న తన వంతు కృషిని అభినందించారు.
పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ.. మరోసారి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో అతడు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ తన ఆశీస్సులు అందించారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ప్రజా జీవితంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 30 ఏళ్ల సినీ ప్రస్థానం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
తొలి సినిమాలోనే రియల్ స్టంట్స్‌తో సంచలనం!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలలో నిర్మాత అల్లు అరవింద్ ఎంతటి కీలక పాత్ర పోషించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే ఒరవడిని కొనసాగిస్తూ చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్‌ను కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం అల్లు అరవింద్ కెరీర్‌లో అత్యంత గర్వించదగిన క్షణాల్లో ఒకటిగా నిలిచింది. అందుకే పవన్ కళ్యాణ్ సినీ రంగంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన డెబ్యూ మూవీ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` జ్ఞాపకాలను అల్లు అరవింద్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీని ఇవ్వగలిగారు.
తొలి సినిమాతోనే నటుడిగా తన ప్రత్యేకతను చాటుకోవాలని తపించిన పవన్ కళ్యాణ్, ఆ సినిమా కోసం చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ సెషన్స్ -రియల్ స్టంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఎలాంటి డూప్‌ల సహాయం లేకుండా, నేరుగా లైవ్‌లో తన చేతులపైకి కార్లను పోనిచ్చిన విజువల్స్ అప్పట్లో ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆశ్చర్యపరిచాయి. మార్షల్ ఆర్ట్స్ రంగంలో అతడికి ఉన్న అపారమైన నైపుణ్యాన్ని, తెగింపును ఈ సాహసాలు అప్పట్లోనే బలంగా ఎలివేట్ చేశాయి. నాటి ఆ తొలి అడుగుల సాహసమే నేడు పవన్ కళ్యాణ్‌ను `పవర్ స్టార్` స్థాయికి చేర్చడంలో ప్రధాన భూమిక పోషించిందనడంలో సందేహం లేదు. రాజకీయాల్లోను జనసైనికుడిగా అతడి ఎదుగుదలపైనా ప్రశంసలు కురుస్తున్నాయి.