'కాకా'తో 'కోన'.. ఈసారి టాప్ లీగ్ లోకి రావాలంటే..
ఒకప్పుడు కోన వెంకట్ పేరు వినిపిస్తే చాలు.. ప్రేక్షకులకు కామెడీ గుర్తొచ్చేది. ఆయన రాసిన సినిమాల్లో నవ్వులకు లోటు ఉండేది కాదు.
ఒకప్పుడు కోన వెంకట్ పేరు వినిపిస్తే చాలు.. ప్రేక్షకులకు కామెడీ గుర్తొచ్చేది. ఆయన రాసిన సినిమాల్లో నవ్వులకు లోటు ఉండేది కాదు. పాత్రల మధ్య కన్ఫ్యూజన్, పంచ్ డైలాగులతో థియేటర్లలో సందడి చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన నుంచి గతంలో వచ్చిన రేంజ్ సక్సెస్ లు కనిపించడం లేదు. దీంతో మళ్లీ తన పాత ఫామ్ ను అందుకోవాలంటే కోన వెంకట్ ఏం చేయాలన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్, బాద్ షా వంటి సినిమాలు కోన వెంకట్ కు రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా కామెడీ కథలో కలిపి, ప్రేక్షకులను నవ్వించడంలో ఆయనకు స్పెషల్ స్టైల్ ఉండేది. హీరో పాత్రతో పాటు సైడ్ రోల్స్ ద్వారా కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవారు. దీంతో ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారంటే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేవి. అయితే ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ మారింది. అందుకే ఓల్డ్ స్టైల్ కామెడీతో మెప్పించడం ఈజీ కాదు.
ఇటీవల ఆయన నిర్మాణంలో వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది, బ్యాండ్ మేళం వంటి సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. రీసెంట్ గా శ్రీవిష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు ప్రెజెంటర్ గా వ్యవహరించారు. కొన్ని సీన్స్, కామెడీ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. స్టోరీ విషయంలో పాత పద్ధతులు కనిపించాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా కామెడీ కోసం కథను సాగదీయకుండా ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదనే చర్చ సాగుతోంది. అయితే ఆ రిజల్ట్స్ తో కోన వెంకట్ పని అయిపోయిందని చెప్పలేం. ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పటి సినిమాలకు తగ్గట్టుగా తన రైటింగ్ లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకప్పుడు పనిచేసిన ఫార్ములాను ప్రతిసారీ నమ్ముకోవడం కంటే, కొత్త కథలు ఎంచుకోవడంపై దృష్టి పెట్టాలి. కథలోని పరిస్థితుల నుంచే నవ్వులు వచ్చేలా రాయాలి.
అలాగే ఇప్పటి జనరేషన్ రైటర్స్ తో కలిసి పనిచేయడం ఆయనకు హెల్ప్ అవ్వొచ్చు. తన అనుభవానికి కొత్త ఆలోచనలు తోడైతే కథల్లో కొత్తదనం కనిపించే అవకాశం ఉంది. కామెడీతో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్, ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, గుర్తుండిపోయే పాత్రలపైనా దృష్టి పెట్టాలి. ప్రేక్షకులు ఇప్పుడు పంచ్ డైలాగుల కోసమే థియేటర్లకు రావడం లేదు. కథలో కొత్తదనం ఉంటేనే సినిమాతో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.
అందుకే ఇప్పుడు చిరంజీవి కాకా మూవీ.. కోన వెంకట్ కు మంచి ఛాన్స్ అని చెప్పాలి.nమరోవైపు రవితేజతో తులాభారం వంటి ప్రాజెక్టులకు కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. ఆ సినిమాలతో కోన వెంకట్ ఎలాంటి కథలను ఎంచుకుంటారన్నది ముఖ్యం. తన ఓల్డ్ సక్సెస్ లను గుర్తు చేసుకోవడం కంటే, ఇప్పటి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందించడమే ఆయన ముందున్న అసలు సవాలు. 'కాకా'తో ఆ ఛేంజ్ కనిపిస్తే.. కోన వెంకట్ మళ్లీ టాప్ రైటర్స్ లీగ్ లోకి వెళ్లడం గ్యారంటీ అని చెప్పాలి.