రాజమౌళి గ్లోబల్ విజయంలాగే రణ్‌బీర్ రామాయణం!
రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ `రామాయణం` పై బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ `రామాయణం` పై బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గ్లోబల్ లెవెల్ అంబిషన్స్‌ను రాజమౌళి తెరకెక్కించిన `ఆర్.ఆర్.ఆర్` విజయంతో పోల్చారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ప్రపంచవ్యాప్తంగా మన సినిమాల స్థాయిని పెంచే భారీ ప్రయత్నాలను అందరూ ప్రోత్సహించాలని అభి ప్రాయపడ్డారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పౌరాణిక చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. భారతీయ సంస్కృతి, ఇతిహాసాల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో పాటు కొన్ని వర్గాల నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదురవుతోంది. దీనిపై స్పందించిన గుల్షన్ దేవయ్య.. సినిమా నచ్చినా? నచ్చకపోయినా? ప్రపంచవ్యాప్తంగా మన సత్తా చాటే ఇలాంటి పెద్ద ప్రయత్నాలకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రాజమౌళి `ఆర్.ఆర్.ఆర్` సాధించిన ఘనతను ఉదహరించారు. తనకు వ్యక్తిగతంగా ఆ సినిమాతో పూర్తి స్థాయిలో కనెక్ట్ కాకపోయినా? అమెరికా వంటి దేశాల్లో ఆ చిత్రం సంచలన విజయం సాధించడం భారతీయ సినిమాకు ఎంతో గర్వకారణమన్నారు. హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్కెట్ ఉందో? అదే స్థాయిలో మన సినిమాలను గ్లోబల్ ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలనే పెద్ద ఆలోచన ఉండటంలో తప్పులేదని సమర్థించారు. రాజమౌళి వేసిన ఆ అడుగు ద్వారానే మిగతా చిత్రాలకూ గ్లోబల్ మార్కెట్ తలుపులు తెరుచు కుంటున్నాయని తెలిపారు.
అయితే రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాలను తెరకెక్కించడం అంత సులువు కాదని గుల్షన్ అంగీకరించారు. గతంలో వచ్చిన రామానంద్ సాగర్ `రామాయణ్` సీరియల్‌లో అరుణ్ గోవిల్ పోషించిన రాముడి పాత్రను నేటి తరంలో చాలా మంది తమ బాల్యపు జ్ఞాపకాలుగా, భావోద్వేగాలతో ముడిపెట్టి చూస్తుంటారన్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక హంగులతో రాముడి పాత్రను మలచడం, ప్రేక్షకులకు ఆ భావోద్వేగాన్ని పంచడం నటీనటులకు, దర్శ కులకు పెద్ద సవాల్‌తో కూడిన విషయమని విశ్లేషించారు.
భారతీయ డయాస్పోరాతో పాటు విదేశీ ప్రేక్షకులను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం ముమ్మాటికీ సాహసోపేతమైన విషయమేనని గుల్షన్ అభిప్రాయపడ్డారు. మన మూలాలను, సంస్కృతిని కాపాడుకుంటూనే గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేయడం దేశీయ చలనచిత్ర పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పట్ల వస్తున్న విమర్శలను పక్కన పెట్టి భారతీయ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసే భారీ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు.
భారీ బడ్జెట్, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ హంగులతో రెండు భాగాలుగా రూపొందుతున్న `రామాయణం` చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, విడుదల తేదీలపై వస్తున్న అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గ్లోబల్ స్థాయిలో ఇండియన్ సినిమా సత్తా చాటేందుకు వస్తున్న ఇలాంటి భారీ చిత్రాలకు ప్రముఖుల నుంచి వస్తున్న మద్దతు ఇండస్ట్రీలో మరింత జోష్ నింపుతోంది.