కొత్త ప్రపంచ సృష్టికర్తల అసలు రూపం ఇదే!
ఈ చిత్రంలో నటించడానికి తనకు ఆసక్తితో పాటు కాస్త భయం కూడా వేసిందని ఆండ్రూ గార్‌ఫీల్డ్ ఓపెన్ అయ్యారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ టెక్ విప్లవం వెనుక అసలు తెరవెనుక ఏం జరుగుతోంది? ఓపెన్ ఏఐ పుట్టుక.. దాని చుట్టూ నడిచిన నాటకీయ పరిణామాల ఆధారంగా తెరకెక్కిన `ఆర్టిఫిషియల్` సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం టెక్ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తోన్న పెద్దల అసలు జీవితాలు, తెర వెనుక తీసుకునే సంచలన నిర్ణయాలను వెలుగులోకి తెచ్చింది. లూకా గ్వాడానినో దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆండ్రూ గార్‌ఫీల్డ్.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ పాత్రలో కనిపించనున్నారు. భవిష్యత్తును రీ-డిజైన్ చేస్తున్న ఈ టెక్ దిగ్గజాల అంతరంగాన్ని జనాలకు ఆవిష్కరించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని గార్‌ఫీల్డ్ స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో నటించడానికి తనకు ఆసక్తితో పాటు కాస్త భయం కూడా వేసిందని ఆండ్రూ గార్‌ఫీల్డ్ ఓపెన్ అయ్యారు. ప్రపంచాన్ని ఓ కొత్త శకంలోకి తీసుకెళ్తోన్న టెక్ బాస్‌ల ఆలోచనా విధానం, వారిపై పై ఉండే మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందో? అర్థం చేసుకునేందుకే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు తెలిపారు. భారీ విమర్శలు, సమాజం నుంచి వచ్చే నిత్య పరిశీలనను తట్టుకోవాలంటే కంపెనీల అధిపతులకు మామూలు ధైర్యం సరిపోదని, ఊహాశక్తి, పట్టుదల చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టెక్ రంగంలో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తూ ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తున్న లీడర్లు నిజంగా ఎలాంటివారో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ చిత్రం స్టోరీ సాంకేతికత గురించే కాకుండా.. గడచిన రెండు దశాబ్దాలలో ఓపెన్ఏఐ ప్రయాణాన్ని కవర్ చేస్తూ సాగుతోందిది. చాట్‌జీపీటీ సృష్టి.. దాని వేగవంతమైన విస్తరణతో పాటు 2023లో శామ్ ఆల్ట్‌మాన్‌ను నాటకీయంగా కంపెనీ నుంచి తొలగించడం.. అటుపై ఆయన మళ్ళీ పవర్‌లోకి రావడం వంటి హైవోల్టేజ్ డ్రామా అంతా ఈ సినిమాలో ప్రధానాంశాలుగా హైలైట్ కానున్నాయి. విశేషం ఏంటంటే? 2010లో ఫేస్‌బుక్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ట్రెండింగ్ మూవీ `ది సోషల్ నెట్‌వర్క్లో` నటించిన గార్‌ఫీల్డ్.. ఈసారి శామ్ ఆల్ట్‌మాన్ పాత్ర కోసం ఏకంగా ఆయన్ని వ్యక్తిగతంగా కలవకపోవడం గమనార్హం.
ఇక సినిమాలో అసలుసిసలు ఘర్షణంతా ఏఐ భద్రత, నైతిక విలువల చుట్టూనే తిరుగుతుంది. శామ్ ఆల్ట్‌మాన్‌గా గార్‌ఫీల్డ్ నటిస్తుండగా.. ఓపెన్ఏఐ కో-ఫౌండర్, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుట్స్కేవర్ పాత్రలో రష్యన్ యాక్టర్ యురా బోరిసోవ్ కనిపించనున్నారు. ఆల్ట్‌మాన్ తొలగింపు వ్యవహారంలో కీలక పాత్ర పోషించి, అటుపై కంపెనీని వీడిన సుట్స్కేవర్.. టెక్నాలజీ సేఫ్టీపై వ్యక్తం చేసిన ఆందోళనలను మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. అలాగే `గాడ్‌ఫాదర్ ఆఫ్ AI`గా పేరున్న జియోఫ్రీ హింటన్ పాత్రలో మార్క్ రైలాన్స్ నటించడం విశేషం.
ఈ మల్టీస్టారర్ చిత్రంలో టెస్లా బాస్ ఎలాన్ మస్క్ పాత్రలో ఐక్ బారిన్‌హోల్ట్జ్, ఓపెన్ఏఐ మాజీ సీటీఓ మీరా మురాటి పాత్రలో మోనికా బార్బారో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే.. రియల్ లైఫ్‌లో ఓపెన్ఏఐ ప్రముఖులు ట్విట్టర్‌లో ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్లు, వివాదాలను గమనిస్తూ నటించడం తమకు చాలా అరుదైన అనుభూతినిచ్చిందని మోనికా బార్బారో పేర్కొన్నారు. ప్రతి నెలా మారుతున్న టెక్ రియాలిటీకి తగ్గట్టుగా నటిస్తూ పోవడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుత రోజుల్లో ఏఐ కంట్రోల్ తప్పి మానవాళికి పెనుముప్పుగా మారుతుందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తరుణంలో ఈ సినిమా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫేమస్ `సాటర్డే నైట్ లైవ్` రైటర్ సైమన్ రిచ్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రం.. కేవలం టెక్ విప్లవాన్నే కాకుండా? ఆ వెనుక ఉన్న మానవ భావోద్వేగాలు, సిద్ధాంత భేదాలు, పవర్ పాలిటిక్స్‌ను అద్దం పట్టినట్లు చూపించనుంది. టెక్ వరల్డ్‌లో వస్తున్న వేగవంతమైన మార్పులపై ఒక ప్రామాణికమైన చర్చకు `ఆర్టిఫిషియల్` మూవీ బాటలు వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.