'జైలర్ 2’కు షాక్ తప్పదా? తెలుగు ప్రేక్షకుల్లో ధరల పెంపుపై చర్చ!
సినిమాను సెలబ్రేట్ చేయడంలో తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవ్వరైనా అని.. తెలుగు ప్రేక్షకులంత గొప్ప ఆడియన్స్ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని పర భాషల వాళ్లు కూడా తెగ పొగిడేస్తుంటారు.
సినిమాను సెలబ్రేట్ చేయడంలో తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవ్వరైనా అని.. తెలుగు ప్రేక్షకులంత గొప్ప ఆడియన్స్ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని పర భాషల వాళ్లు కూడా తెగ పొగిడేస్తుంటారు. కానీ ఈ ప్రేమే మనవాళ్లకు శాపంగా మారుతోందా అని ఎప్పటికప్పుడు సందేహాలు కలుగుతుంటాయి. ఈ దసరాకి రిలీజ్ కాబోయే డబ్బింగ్ మూవీ ‘జైలర్-2’కు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరలు పెంచుతారు అనే ప్రచారం పై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఓవైపు తెలుగు సినిమా అయిన ‘రణబాలి’ని నార్మల్ రేట్లతో రిలీజ్ చేస్తుంటే అనువాద చిత్రానికి రేట్లు పెంచడం ఏంటన్నది ఇప్పుడు టాకింగ్ పాయింట్. నెలన్నర ముందు ఇంకో డబ్బింగ్ మూవీ ‘టాక్సిక్’కు కూడా ఇలాగే రేట్లు పెంచి సొమ్ము చేసుకోవడం గమనార్హం. ఇలాంటివి జరిగినపుడే తెలుగు ప్రేక్షకులు ఏం పాపం చేశారు.. వాళ్లకు ఇంత సినిమా పిచ్చి ఉండడమే శాపమా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఐతే ప్రేక్షకులు ఇలాంటి వాటిని భరిస్తున్నారు కాబట్టే వారి మీద ఇంకా ఇంకా భారం మోపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా రేట్లు పెంచిన సినిమాలను తిరస్కరిస్తే తప్ప నిర్మాతలకు బుద్ధి రాదనే వాదనా వినిపిస్తోంది. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలకు ఇకపై రేట్లు పెంచకుండా ఉండాలంటే ‘జైలర్-2’ సినిమా కోసం ఎగబడడం ఆపాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజినీకాంత్ అంటే మన వాళ్లకు ప్రేమే కానీ.. ఆయన సినిమాను తమిళంలో తక్కువ రేట్లతో అక్కడి ప్రేక్షకులు చూస్తుంటే.. మనం మాత్రం ఎక్కువ ధర పెట్టి ఎందుకు చూడాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ‘జైలర్-2’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పడుతున్నాయి. నెటిజన్ల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రజినీ సినిమా మీద ఎన్నడూ లేనంతగా వ్యతిరేకత ఇప్పుడు కనిపిస్తోందన్నది వాస్తవం. ఈ కోపం ‘జైలర్-2’కు వ్యతిరేకంగా మారితే ఆశ్చర్యమేమీ లేదు. అసలే ‘జైలర్-2’ ప్రోమోలు అంత బాగా లేవు. హైప్ తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ‘రణబాలి’కి మంచి టాక్ వస్తే మాత్రం ‘జైలర్-2’కు గట్టి పంచ్ ఇచ్చేలా ఉన్నారు మన ఆడియన్స్.