హీరోల రూట్లో డైరెక్టర్ల పెయిడ్ భజన?

ఈమధ్య సోషల్ మీడియాలో మీమ్స్ పేజీల ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Update: 2026-10-12 04:04 GMT

ఇండస్ట్రీలో హీరోల రెగ్యులర్ ఎలివేషన్స్ కోసం స్పెషల్ టీమ్స్ ఉండడం కామన్. తమ హీరో ఎంత మంచోడో, ఫ్యాన్స్ మీద ఎంత ప్రేమ చూపిస్తాడో చెబుతూ.. నెగిటివ్ బజ్ రాకుండా మార్కెట్ లో హడావుడి చేయడం ఆ టీమ్స్ రెగ్యులర్ డ్యూటీ. కొందరు హీరోల వ్యవహారం జెన్యూన్ గానే ఉన్నా, మరికొందరు మాత్రం డబ్బులిచ్చి మరీ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయించుకుంటారు. అయితే ఇప్పుడు ఈ రూట్ లోకి డైరెక్టర్లు కూడా ఎంటర్ అవ్వడం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ గా మారింది.

ఈమధ్య సోషల్ మీడియాలో మీమ్స్ పేజీల ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని క్యాష్ చేసుకుంటూ కొందరు డైరెక్టర్ల టీమ్స్ భారీగా డబ్బులిచ్చి మరీ తమకు ఎలివేషన్స్ ఇప్పించుకుంటున్నాయి. 'దర్శకుడి విజన్ కు హ్యాట్సాఫ్', 'అసలు ఆ ఆలోచన వేరే లెవెల్' అంటూ మీమ్ పేజీల ద్వారా మోత మోగిస్తున్నారు. ఇదంతా ఎదో ఆర్గానిక్ గా వస్తున్న బజ్ కాదు, పక్కా ప్లానింగ్ తో హ్యూమన్ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ చేయించుకుంటున్న మార్కెటింగ్ అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

నిజానికి రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్లకు పబ్లిక్ లో ఒక రాయల్ ఆరా (Aura) ఉంటుంది. వాళ్ళ వర్క్ లో ఉండే దమ్ము వల్ల ఆ బ్రాండ్ వాటంతట అదే క్రియేట్ అయింది. ఇప్పుడు వాళ్ళ రేంజ్ కు మ్యాచ్ అవ్వాలని, తాము కూడా ఆ స్థాయి విజనరీలమే అని జనాల్లోకి బలంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి డైరెక్టర్లు ఈ మీమ్స్ ట్రెండ్ ను వాడుకుంటున్నారు. మార్కెటింగ్ లో, తమ బ్రాండ్ బిల్డింగ్ లో ఇప్పుడు ఇదొక భాగమైపోయింది.

ఈ ఆరా క్రియేట్ చేయడానికి వీళ్లు వాడుతున్న మరో అస్త్రం 'స్పెషల్ కట్స్'. ఈమధ్య ప్రతి సినిమాకు మేకింగ్ వీడియోలతో పాటు డైరెక్టర్స్ స్పెషల్ కట్స్ అంటూ కొన్ని వీడియోలు వదులుతున్నారు. అందులో డైరెక్టర్ సెట్ లో ఎంత సీరియస్ గా ఉంటాడు, షాట్ కోసం ఎంత కష్టపడతాడు లాంటివి హైలైట్ చేస్తూ భీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. ఇదంతా చూసి నిజంగానే ఈ డైరెక్టర్ వేరే లెవెల్ అని కామన్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ దర్శకులు ఈ ట్రెండ్ కు దూరంగా ఉంటే, కేవలం రెండు మూడు సినిమాలు చేసిన లేటెస్ట్ జనరేషన్ డైరెక్టర్లు మాత్రం ఈ స్ట్రాటజీని గట్టిగా పట్టుకున్నారు. కంటెంట్ తో పాటు హీరోల్లాగా తమకంటూ ఒక కల్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనే ఆరాటంతోనే ఈ కుర్ర దర్శకులు ఈ రేంజ్ లో హడావుడి చేస్తున్నారు.

ఇప్పటి కాంపిటీషన్ కు తగ్గట్లుగా మార్కెటింగ్ లో ఇలాంటి స్ట్రాటజీలు ఫాలో అవ్వడం తప్పు కాదు. కానీ కేవలం మీమ్స్, ఎలివేషన్ వీడియోలతో బజ్ క్రియేట్ చేస్తే సరిపోదు. ఆ బిల్డప్ కు తగ్గట్టుగా థియేటర్లో కంటెంట్ కూడా పర్ఫెక్ట్ గా పేలాలి. రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా, ఈ డబ్బులిచ్చి చేయించుకున్న 'విజన్' ఎలివేషన్స్ అన్నీ ట్రోల్స్ గా మారే రిస్క్ ఉంది. ప్రమోషన్స్ భజన మీద పెడుతున్న శ్రద్ధ స్క్రిప్ట్ మీద కూడా పెడితే సేఫ్.

Tags:    

Similar News