'ఆల్ఫా' గ్యాంగ్ స్పెష‌ల్ ట్రీట్ గురించే వెయిటింగ్!

యష్ రాజ్ ఫిలింస్ (YRF) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ఆల్ఫా` వచ్చే నెల జూలై 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Update: 2026-06-21 03:54 GMT

యష్ రాజ్ ఫిలింస్ (YRF) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ఆల్ఫా` వచ్చే నెల జూలై 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ్ రావల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వచ్చినా... వెండితెరపై లేడీ స్పైల వీరవిహారాన్ని వీక్షించాల‌నే ఉత్సాహం అంద‌రిలోను ఉంది. యాక్షన్ ప్రియులను, ముఖ్యంగా యూత్‌ను ఆల్ఫా గాళ్స్ పోరాటాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేస్తూ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది.

ఈ సినిమాలో ఆలియా భట్, శార్వరి ఇద్దరూ మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలు, ప్రత్యేక ఆయుధాలతో శత్రువులపై విజృంభించబోతున్నారు. వైఆర్‌ఎఫ్ తాజాగా విడుదల చేసిన సోలో పోస్టర్లలో వీరిద్దరి లుక్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. ఇందులో ఆలియా ధ‌రించిన‌ ప్రమాదకర చేతి ఆయుధం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మరోవైపు శార్వరి ఒక ప్రత్యేకమైన పొడవైన ప్ర‌త్యేక‌మైన ఆయుధాన్ని చేతబట్టి భయపెడుతోంది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఈ ఇద్దరు భామల ఆయుధాల విన్యాసాలు థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్‌ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.




 


మరోవైపు `ఆల్ఫా` ప్రమోషన్స్ కోసం చిత్రబృందం ఎంచుకున్న ఒక సరికొత్త డిజిటల్ వేదిక‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గతంలో తీవ్ర వివాదాల నడుమ ఆగిపోయిన ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా షో `ఇండియాస్ గాట్ లేటెంట్` దాదాపు ఏడాది విరామం తర్వాత సీజన్ 2తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తోంది. ఈ సంచలన షో ప్రీమియర్ ఎపిసోడ్‌కు `ఆల్ఫా` బ్యూటీస్ ఆలియా భట్, శార్వరి ముఖ్య అతిథులుగా హాజరవుతుండటం విశేషం. సమయ్ రైనా అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన థంబ్ నెయిల్ ఆధారంగా ఈ అఫీషియల్ అప్‌డేట్ బయటకు వచ్చింది.




 


ఈ ఎపిసోడ్‌లో ఆలియా, శార్వరిలతో పాటు ప్యానలిస్ట్‌లుగా బలరాజ్ సింగ్ ఘాయ్, ఆశిష్ సోలంకి కూడా సందడి చేయనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్న ఈ ప్రీమియర్ ఎపిసోడ్ కోసం నెటిజన్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక‌సారి నిషేధాన్ని ఎదుర్కొని మ‌ళ్లీ ఒక పెద్ద ఓటీటీ సంస్థ‌తో ఒప్పందం ద్వారా కంబ్యాక్ ఇస్తున్న స‌మ‌య్ రైనా షో ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. దీనిని యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ లో ఒకే స‌మ‌యంలో .. 2వారాల‌కోసారి టెలీకాస్ట్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇది గ్రేట్ కంబ్యాక్ అంటూ నెటిజ‌నులు ప్ర‌శంసిస్తున్నారు.




 


ఇలా ఒకవైపు నెట్‌ఫ్లిక్స్‌లో సమయ్ రైనా సరికొత్త కామెడీ స్పెషల్ షో డెవలప్‌మెంట్‌లో ఉండగా, మరోవైపు లీగల్ టీమ్స్ పర్యవేక్షణలో సేఫ్‌గా `ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2`లో `ఆల్ఫా` ప్రమోషన్స్ చేయడం సినిమాకు భారీ హైప్ తెచ్చిపెడుతోంది. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో 7వ చిత్రంగా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాబీ డియోల్ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఆలియా భట్, శ‌ర్వానంద్ ఎలాంటి యాక్ష‌న్ విన్యాసాల‌తో ర‌క్తి క‌ట్టించ‌బోతున్నారో చూడాల‌నే ఆస‌క్తి నెల‌కొంది.




 


Tags:    

Similar News