క్వీన్ కంగన బ్యాడ్ టైమ్: క్రేజీ ప్రాజెక్ట్‌లో రీప్లేస్ చేసిన ఆలియా?
బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కంగనా రనౌత్.. స్టార్ కిడ్ ఆలియా భట్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుందని అందరికీ తెలిసిందే.;
బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కంగనా రనౌత్.. స్టార్ కిడ్ ఆలియా భట్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆలియాను నెపోకిడ్ అంటూ కంగన పలుమార్లు విమర్శించడమే కాకుండా.. కరణ్ జోహార్ ఆమెకు ఇచ్చే మద్దతును కూడా తప్పుబట్టింది. అయితే ఆలియా భట్ మాత్రం ఎప్పుడూ హుందాగానే స్పందిస్తూ... తనకు కంగనపై వ్యక్తిగత ద్వేషం లేదని.. తన నటనను గౌరవిస్తానని చెబుతూ వచ్చింది. తాజాగా సోహమ్ షా ప్రతిష్టాత్మక చిత్రం `తుంబాడ్ 2` విషయంలో ఈ ఇద్దరు భామల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటం ఇటీవల సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
`తుంబాడ్ 2`లో కంగనా రనౌత్ ఒక కీలక పాత్రలో నటించబోతోందని గతంలో ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం .. ఈ క్రేజీ సీక్వెల్‌లో ఆలియా భట్ చిన్నదే అయినా కానీ అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా.. కథను మలుపు తిప్పే గంభీరమైన పాత్ర కావడంతో మేకర్స్ ఆలియాను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు అధికారిక ప్రకటన రాగా... కంగన ఉనికిపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. ఇది కంగనను ఆలియా రీప్లేస్ చేసిందనే ప్రచారానికి ఊతమిస్తోంది.
షెడ్యూల్ వివరాల ప్రకారం... ఆలియా భట్ మే 3న తనవంతు షూటింగ్‌లో పాల్గొని.. అనంతరం అమెరికాలో జరిగే మెట్ గాలా 2026 వేడుక కోసం బయలుదేరింది. కంగన విదేశాల్లో ఉన్న సమయంలో ప్యాచ్ వర్క్ షాట్స్ కోసం బాడీ డబుల్‌ను వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 6న తిరిగి వచ్చిన తర్వాత ఆమె మళ్లీ సెట్స్‌లో జాయిన్ కానుంది. చిత్ర యూనిట్ కంగన గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందా లేదా తన స్థానంలో ఆలియాను తీసుకున్నారా అన్నది అస్పష్టంగా ఉంది. ఒకవేళ ఇద్దరూ ఉంటే.. వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటారా! అన్నది ఆసక్తికరంగా మారింది.
కంగనా రనౌత్ కెరీర్ ప్రస్తుతం కొంత ఒడిదుడుకుల్లో ఉంది. గత చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో `తుంబాడ్ 2` వంటి క్రేజీ ప్రాజెక్ట్ చేజారిపోయిందనే వార్త బ్యాడ్ టైమ్ నడుస్తోందనే సంకేతాలను ఇస్తోంది. ప్రస్తుతం కంగన చేతిలో `భారత్ భాగ్య విధాత` , `క్వీన్ 2` వంటి చిత్రాలు ఉన్నాయి. మరోవైపు ఆలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో `లవ్ అండ్ వార్` వంటి భారీ చిత్రంతో బిజీగా ఉంది. ఈ సమయంలో `తుంబాడ్ 2`లో ఆలియా ఎంట్రీ కచ్చితంగా సినిమా హైప్‌ను పెంచే అంశమే.
`తుంబాడ్ 2` కాస్టింగ్ చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు బాలీవుడ్ పాలిటిక్స్‌ను మరోసారి తెరపైకి తెచ్చాయి. కంగన విమర్శలకు గురైన ఆలియానే ఇప్పుడు తన స్థానంలోకి వచ్చిందా అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవేళ కంగన ఈ ప్రాజెక్ట్‌లో లేకపోతే.. అది తన కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. సోహమ్ షా ఈ చిత్రంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తేనే కానీ .. ఈ రీప్లేస్మెంట్ వార్తలకు ఫుల్ స్టాప్ పడదు.