YRF స్పైవర్స్ మళ్లీ అదే తప్పు చేస్తోందా?

స్పైవర్స్‌ను కొత్త దిశలో తీసుకెళ్లాలని య‌ష్ రాజ్ ఫిల్మ్స్ ప్రయత్నించినప్పటికీ, క్యాస్టింగ్ విషయంలో మేకర్స్ సరైన నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2026-06-10 19:30 GMT

ఒకప్పుడు బాలీవుడ్‌లో అత్యంత స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచిన య‌ష్ రాజ్ ఫిల్మ్స్ స్పై వర్స్ ఇప్పుడు వరుసగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తాజా సినిమా ఆల్ఫాపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ‌వ‌గా, ప్రేక్షకుల నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ముఖ్యంగా ఆలియా భట్‌ను ప్ర‌ధాన పాత్ర‌గా ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్పైవర్స్‌ను కొత్త దిశలో తీసుకెళ్లాలని య‌ష్ రాజ్ ఫిల్మ్స్ ప్రయత్నించినప్పటికీ, క్యాస్టింగ్ విషయంలో మేకర్స్ సరైన నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

టీజర్‌లో ఆలియా భట్‌ను అత్యంత ప్రమాదకరమైన స్పైగా, చిన్నప్పటి నుంచే స్పెష‌ల్ ట్రైనింగ్ పొందిన యోధురాలిగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ పాత్రకు అవసరమైన ఫిజికల్ ప్రెజెన్స్, యాక్షన్ ఇమేజ్, స్క్రీన్ కమాండ్ ఆలియాలో కనిపించడం లేదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హాలీవుడ్‌లో ఇలాంటి పాత్రలు పోషించిన ఏంజెలీనా జోలీ, గాల్ గడోట్ లేదా భారతీయ స్థాయిలో ప్రియాంక చోప్రా వంటి నటీమణులతో పోల్చితే ఆలియా ఎంపిక కొంత అసాధారణంగా అనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాక్టింగ్ పరంగా ఆలియా తన టాలెంట్ ను ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్న‌ప్ప‌టికీ, ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఫ్రాంచైజీని భుజాలపై మోసే పాత్రలో ఆమె ఎంతవరకు నమ్మకం కలిగించగలదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా టీజర్‌లో చూపించిన బ్యాక్‌స్టోరీ కూడా చర్చకు కారణమైంది. తండ్రి తన కూతురిని చిన్నప్పటి నుంచే ప్రత్యేక సైనికురాలిగా తీర్చిదిద్దే కథాంశం హాలీవుడ్ యాక్షన్ సినిమాలను గుర్తు చేస్తోందని ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో స్పైవర్స్ సినిమాలు కొత్తదనంతో ఆకట్టుకున్నప్పటికీ, ఇప్పుడు అదే ఫార్ములాను మరోసారి ఉపయోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. యాక్షన్ సీన్స్, స్టైలిష్ విజువల్స్ ఉన్నప్పటికీ కథలో కొత్తదనం కనిపించకపోవడం కొందరిని నిరాశపరిచింది. ముఖ్యంగా ఇటీవల స్పైవర్స్‌కు చెందిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయిన తర్వాత కూడా YRF కథా నిర్మాణంలో పెద్ద మార్పులు తీసుకురాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా టీజర్ చివర్లో కనిపించిన ఒక సన్నివేశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆలియా పాత్ర ఒక వ్యక్తిని హత్య చేసే సన్నివేశాన్ని గ్లామరస్‌గా ప్రెజెంట్ చేయడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్రధాన పాత్రను శక్తివంతంగా చూపించే ప్రయత్నంలో అవసరానికి మించిన గ్లామర్ జోడించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ పై తరచూ విమర్శలు చేసే బాలీవుడ్ వర్గాలు, ఇలాంటి అంశాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నాయనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఆల్ఫా టీజర్ రిలీజ్‌తో సినిమాపై ఆసక్తి పెరిగినప్పటికీ, అదే సమయంలో అనేక సందేహాలు కూడా తలెత్తాయి. ముఖ్యంగా ఆలియా భట్ క్యాస్టింగ్, క్యారెక్ట‌ర్ డిజైన్, కథలోని హాలీవుడ్ ప్రభావం వంటి అంశాలు ప్రస్తుతం ప్రధాన చర్చగా మారాయి. గత కొన్నేళ్లుగా ఎదురైన ఫలితాల నుంచి YRF నిజంగా పాఠాలు నేర్చుకుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం సినిమా విడుదలైన తర్వాతే దొరకనుంది.


Full View


Tags:    

Similar News