650 మంది స్టంట్ ఆర్టిస్టులకు స్టార్ హీరో బీమా
తాజాగా 650 మంది స్టంట్ కార్మికులకు ఆరోగ్యబీమా-ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఖిలాడీ అక్షయ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమలో ప్రశంసలు కురుస్తున్నాయి.;
ఇటీవల తమిళ స్టార్ హీరో ఆర్య నటిస్తున్న సినిమా (పా రంజిత్ దర్శకుడు) సెట్లో స్టంట్ మన్ రాజు ప్రమాదవశాత్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక కార్ ఛేజ్ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో కార్ అదుపు తప్పి బోల్తా పడింది. అందులో స్టంట్ మన్ మరణించారనే వార్త దావానలంలా మారింది. ఈ ఘటనతో పరిశ్రమలో పని చేసే స్టంట్ ఆర్టిస్టుల జీవితాలకు భరోసా ఉందా? అనే సందేహాలు కలిగాయి. వారికి ఆరోగ్యం, ప్రమాద బీమా వంటి తక్షణ అవసరాలను ఈ ఘటన ఎత్తి చూపింది.
తాజాగా 650 మంది స్టంట్ కార్మికులకు ఆరోగ్యబీమా-ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఖిలాడీ అక్షయ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమలో ప్రశంసలు కురుస్తున్నాయి. అక్షయ్ తీసుకున్న నిర్ణయం అద్భుతమైనది. ఈ తరహా ఇది తొలి అడుగు అంటూ ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్‌లో దాదాపు 650 నుండి 700 మంది స్టంట్‌మెన్, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు. ఈ పాలసీలో ఆరోగ్యం, ప్రమాద కవరేజ్ రెండూ ఉన్నాయి. సెట్‌లో లేదా వెలుపల స్టంట్ పెర్ఫార్మర్ గాయపడితే రూ.5 నుండి రూ.5.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చు అని తెలుస్తోంది.
అయితే అక్షయ్ సాయం ఎంత గొప్పది అయినా, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. రిస్కీ జాబ్ చేసే స్టంట్ మన్‌లకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య మరియు ప్రమాద బీమా చేయించాలి. వారి కుటుంబాలకు జీవనభృతిని పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా సెట్లలో నిర్మాణాత్మక మార్గదర్శకాలు, ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లు, ఎక్కువ జవాబుదారీతనం తక్షణ అవసరం అని మేకర్స్ గమనించాలి. ఇలాంటి అవకాశం తెలుగు చిత్రసీమ స్టంట్ కార్మికులకు వర్తింపజేయాలంటే ఎవరైనా స్టార్ హీరోలు ముందుకు రావాల్సి ఉంటుంది.