అక్షయ్ 'భూత్ బంగ్లా' టాక్: ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా?
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కామెడీ సినిమాల స్పెషలిస్ట్ ప్రియదర్శన్ కాంబినేషన్ అంటే బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.;
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కామెడీ సినిమాల స్పెషలిస్ట్ ప్రియదర్శన్ కాంబినేషన్ అంటే బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దశాబ్ద కాలం తర్వాత వీరిద్దరూ కలిసి 'భూత్ బంగ్లా' అనే హారర్ కామెడీతో ముందుకు రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక పురాతన బంగ్లా, అందులో ఉండే దెయ్యం, ఆ మిస్టరీని ఛేదించే హీరో ఫ్యామిలీ.. ఈ లైన్ వినడానికి బాగానే ఉన్నా, థియేటర్లలో సినిమా చూసిన ఆడియన్స్ నుంచి మాత్రం ఊహించని రియాక్షన్స్ వస్తున్నాయి.
పబ్లిక్ టాక్ ప్రకారం, అక్షయ్ కుమార్ లుక్ పై కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. తన వయసుకి మించిన పాత్రలోనో లేక వయసును దాచే ప్రయత్నంలోనో ఉన్నట్టుగా కనిపిస్తుండటంతో ఆడియన్స్ దాన్ని అంతగా ఓన్ చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అక్షయ్ కంటే వయసులో చిన్నవాడైన జిషూ సేన్ గుప్తా తండ్రి పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని అర్ధమవుతుంది. ఈ 'మిస్ మ్యాచ్' కాస్టింగ్ వల్ల కథలో ఉండాల్సిన సీరియస్ నెస్ ఎక్కడో మిస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కామెడీ విషయానికి వస్తే, పరేష్ రావల్ రాజ్‌పాల్ యాదవ్ లాంటి హేమాహేమీలు ఉన్నా కూడా పాత కాలం నాటి జోకులనే నమ్ముకోవడం పెద్ద మైనస్ గా మారింది. ఒకప్పుడు ఇలాంటి కామెడీ క్లిక్ అయ్యేదేమో కానీ, నేటి తరం ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు. వీపు కాల్చుకోవడం లాంటి సీన్లను పదే పదే చూపించడం వల్ల నవ్వు కంటే విసుగే ఎక్కువగా వస్తోందని యూత్ అభిప్రాయపడుతున్నారు. ఫస్టాఫ్ అంతా కథలో వేగం లేకపోవడంతో ఆడియన్స్ ఓపికకు పరీక్ష పడుతోందని మరికొందరు అంటున్నారు.
ఇక హారర్ ఎలిమెంట్స్ గురించి చెప్పాలంటే, నేటి తరం ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నో రకాల థ్రిల్లర్లు చూశారు. అలాంటి వారిని కేవలం సౌండ్ ఎఫెక్ట్స్ తో, పాత పద్ధతిలో భయపెట్టాలని చూడటం పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. సినిమా విజువల్ గా చాలా రిచ్ గా ఉన్నా, కథలో ఉండాల్సిన బలం లేకపోవడంతో ఆ కష్టమంతా వృథా అయిందని సామాన్య ప్రేక్షకులు ఓపెన్ గానే చెబుతున్నారు. ఏ దశలోనూ ప్రేక్షకుడికి భయం పుట్టించే ఒక్క సీన్ కూడా ఇందులో క్లిక్ కాలేదు.
పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే, అక్షయ్ కుమార్ కి ఇది మరో యావరేజ్ మూవీగానే మిగిలిపోయేలా ఉంది. హీరోలు తమ ఇమేజ్ కు తగ్గట్టుగా, కథలో వైవిధ్యం ఉండేలా చూసుకోకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది అని ఆడియన్స్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అక్షయ్ తన తదుపరి సినిమాల విషయంలోనైనా రూట్ మార్చకపోతే బాక్సాఫీస్ వద్ద పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రియదర్శన్ తన పాత సినిమాల ఫ్లేవర్‌నే ఇప్పుడూ రుద్దాలని చూడటం ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు.
కేవలం పాత కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్ తో థియేటర్లకు వెళ్లే వారికి ఇది ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామాగానే మిగిలిపోతుంది. సినిమా నిడివిని కనీసం ఒక పదిహేను నిమిషాలైనా ఎడిట్ చేసి ఉంటే బాగుండేదనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. అక్షయ్ కుమార్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో ఉన్న తరుణంలో, ఇలాంటి కంటెంట్ లేని స్క్రిప్టులు ఆయనకు మరింత సవాలుగా మారనున్నాయి. తదుపరి ప్రాజెక్టుల విషయంలోనైనా ఖిలాడీ గారు స్క్రిప్ట్ సెలక్షన్‌లో పక్కాగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.