అఖండ 2 రిలీజ్.. ఇది అసలు మ్యాటర్!
టాలీవుడ్ నటసింహం, నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ నటసింహం, నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సీక్వెల్ అఖండ-2 తాండవంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపీ అచంట, రామ్ అచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంయుక్త, హర్షాలీ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మాస్ డివోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న అఖండ-2పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంతా అంచనా వేస్తున్నారు. అయితే దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రీసెంట్ గా తీసుకొచ్చిన టీజర్ తో మళ్లీ క్లారిటీ కూడా ఇచ్చారు.
కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీఎఫ్ ఎక్స్ వర్క్ అప్పటికి కంప్లీట్ అవ్వడం సాధ్యం కాదని, అందుకే డిసెంబర్ కు వాయిదా వేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ నెల 18న సినిమాను రిలీజ్ చేస్తారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే అవేం నిజం కాదని ఇప్పుడు తెలుస్తోంది. అనుకున్న డేట్ ప్రకారమే సినిమా రిలీజ్ అవ్వనుందట. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేసేందుకు మేకర్స్ సిద్ధంగా లేరని వినికిడి. ఇప్పటికే థియేటర్ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం. కాబట్టి విడుదల వాయిదా పడుతున్నట్లు వస్తున్న వార్తలు రూమర్లేనట.
దీనిపై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వనున్నారని సమాచారం. టీజర్ లాంటి మరో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని.. ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులకు బిగ్ ట్రీట్ ఇవ్వనున్నారని వినికిడి. ఇప్పటికే స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ కు చెక్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.