పీరియడ్ సినిమాల సీక్రెట్ వెపన్… టాలీవుడ్ ఎందుకు వదులుకుంటోంది?

ఇండియన్ సినిమాల్లో పీరియడ్, మైథాలజీ, ఫాంటసీ జానర్లకు ప్రస్తుతం బాగా ఊపు వ‌చ్చింది.;

Update: 2026-04-16 05:37 GMT

ఇండియన్ సినిమాల్లో పీరియడ్, మైథాలజీ, ఫాంటసీ జానర్లకు ప్రస్తుతం బాగా ఊపు వ‌చ్చింది. ఈ తరహా సినిమాల్లో విజువల్స్ ఎంత ముఖ్యమో, అంతకంటే ఎక్కువగా మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రభావం ఉంటుంది. కథలోని ఎమోష‌న్స్ ను ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ చేయడంలో బీజీఎం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ హై పాయింట్స్, హీరో ఎలివేషన్.. వీటన్నింటికీ స‌రైన మ్యూజిక్ ప‌డితేనే ఆ సీన్స్ కు గూస్‌బంప్స్ వ‌స్తాయి. అందుకే ఇప్పుడు మేకర్స్ సినిమా సక్సెస్‌లో మ్యూజిక్ స‌గ‌మ‌నే అనే భావనతోనే కంపోజర్లను ఎంపిక చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరాఠీ నుంచి బాలీవుడ్ వరకు తమ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సంగీత దర్శక ద్వయం అజ‌య్ అశోక్ గొడ‌వ‌లె- అతుల్ అశోక్ గొడ‌వ‌లె ప్రత్యేకంగా నిలుస్తున్నారు. గ్రాండియర్ ఆర్కెస్ట్రేషన్‌తో పాటూ రూటెడ్ మెలోడీస్‌ని కంపోజ్ చేయ‌డం వీరి స్టైల్. పీరియడ్ సినిమాలకు అవసరమైన ఆ ఆత్మీయత, భవ్యత రెండింటినీ సమానంగా అందించగల కెపాసిటీ వీరికి ఉంది. అందుకే తుంబాడ్, పానిప‌ట్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో వీరి సంగీతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, వాటి మ్యూజిక్ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు ఈ డ్యూయో మరోసారి తమ మ్యాజిక్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. రితేష్ దేశ్‌ముఖ్ నుంచి వ‌స్తున్న రాజా శివాజీ సినిమా కోసం అజయ్- అతుల్ కంపోజ్ చేసిన‌ ఆంథమ్ సాంగ్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినిపించిన విధానం ప్రేక్షకులకు వెంటనే గూస్‌బంప్స్ తెప్పించిందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా ద్వారా మరోసారి వీరి మ్యూజికల్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి పెరిగింది. అయితే ఆశ్చర్యకరంగా, టాలీవుడ్ మాత్రం ఇప్పటివరకు వీరి టాలెంట్ ను పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. భారీ ప్రాజెక్టుల విషయంలో ఆల్రెడీ ఫేమ‌స్ అయిన దేవీ శ్రీ ప్ర‌సాద్, త‌మ‌న్, అనిరుధ్ ర‌విచంద‌ర్ లాంటి పేర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అజయ్-అతుల్ తమ టాలెంట్‌ను బాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకున్నప్పటికీ, తెలుగులో అవకాశాలు మాత్రం లిమిటెడ్ గానే ఉన్నాయి.

ఆల్రెడీ ర‌వితేజ హీరోగా వ‌చ్చిన షాక్ మూవీతో వీరు టాలీవుడ్ కు ఎంట‌ర్ అయ్యారు. ఆ సినిమా హిట్ అవ‌క‌పోవడంతో ఎవ‌రూ వారిని, వారి మ్యూజిక్ ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ర‌ణ‌బాలితో టాలీవుడ్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్‌లో కూడా వీరు అందించిన బీజీఎం చాలా సూతింగ్‌గా, విన‌గానే ఆక‌ట్టుకునేలా ఉంద‌ని ప్ర‌శంస‌లొచ్చాయి.

మొత్తానికి, మైథాలజీ మరియు ఫాంటసీ ప్రాజెక్ట్స్ పెరుగుతున్న ఈ సమయంలో అజయ్-అతుల్ వంటి టాలెంటెడ్ ప‌ర్స‌న్స్ టాలీవుడ్‌కు మంచి ఆప్షన్ అవుతారనే అభిప్రాయం బలపడుతోంది. ఇంతటి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం చూస్తుంటే ఆ ద్వ‌యం అండర్‌రేటెడ్ జీనియస్ అని చెప్పొచ్చు. ర‌ణ‌బాలి త‌ర్వాత అయినా వీరి పేరు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తుందా? లేక మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుందా? అనేది చూడాలి.

Tags:    

Similar News