సినిమాల్లో AI హద్దులు దాటితే...!

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజంతో పాటు ముందుకు వెళ్లగలం.;

Update: 2026-04-25 08:30 GMT

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజంతో పాటు ముందుకు వెళ్లగలం. అందుకే అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ వస్తోంది. సినిమా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం గత అయిదు దశాబ్దాలుగా ఏ స్థాయిలో పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సరికొత్తగా ఏఐ టెక్నాలజీ వచ్చింది. కేవలం స్క్రిప్ట్‌ ఉంటే చాలు మొత్తం కంప్యూటర్‌తో సినిమాను చేసేయొచ్చు. నటీ నటుల అవసరం లేదు, కెమెరా మెన్‌ అవసరం లేదు, సంగీత దర్శకుడు ఇలా ఏ ఒక్కరి అవసరం లేకుండానే మొత్తం సినిమాను ఏఐ లో క్రియేట్‌ చేయవచ్చు. ఇప్పటికే కొన్ని వెబ్‌ సిరీస్‌లు పూర్తి ఏఐ టెక్నాలజీతో వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు సినిమాలు సైతం ఏఐ టెక్నాలజీతో రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏఐ టెక్నాలజీ సినిమాల మేకింగ్‌కు సరి పోతుంది. కానీ బెస్ట్‌ క్వాలిటీ ఔట్‌ పుట్ రావాలంటే మాత్రం ఇంకాస్త ఏఐ టూల్స్ అభివృద్ది చెందాలంటూ ఫిల్మ్‌ మేకర్స్ చెబుతున్నారు.

ఏఐని వినియోగించి సినిమా నిర్మాణం...

సినిమా ఇండస్ట్రీలో పూర్తి స్థాయి ఏఐ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాలంటే మరీ ఎక్కువ సమయం పట్టదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఉన్న ఏఐ టూల్స్ కాస్త అప్డేట్‌ చేస్తే బెస్ట్‌ ఔట్‌ పుట్‌తో పూర్తి సినిమాలు రెడీ అవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కాలంలో ఏఐ ద్వారా వచ్చిన వెబ్‌ సిరీస్‌లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నటీ నటులు లేకుండానే సినిమాలు రూపొందబోతున్నాయి. అది కూడా కొన్ని వారాల్లోనే భారీ సినిమాలు రెడీ కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే సినిమాను పూర్తి ఏఐ టెక్నాలజీతో రూపొందించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని కొందరు అంటున్నారు. సినిమా అనేది ఎమోషన్స్‌ యొక్క కలయిక. ఆ ఎమోషన్స్‌ను ఏఐ ఎంత వరకు తీసుకు రాగలదు అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు ఏఐ ఇంజనీర్స్‌ ఏం సమాధానం చెప్తారు అనేది చూడాలి.

బాలీవుడ్‌ మూవీ 'ద్రోణాచార్య'...

బాలీవుడ్‌లో రూపొందుతున్న 'ద్రోణాచార్య' సినిమా పూర్తి ఏఐ టెక్నాలజీతో రూపొందుతుంది అనే విషయం తెల్సిందే. ఇప్పటి వరకు వచ్చిన ఏఐ సినిమాలతో పోల్చితే ద్రోణాచార్య చాలా స్పెషల్‌గా ఉంటుందని, రెగ్యులర్‌ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ద్రోణాచార్య సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. విభా అగర్వాల్, కన్హయ్య మిట్టల్‌ సమర్పిస్తున్న ఈ సినిమాను భారత్ నెక్స్ట్‌జెన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే సినిమా పూర్తి అయిందని, తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన మూవీ కనుక మార్పులు చేర్పులు, ఇతర దిద్దుబాట్లకు చాలా అవకాశం ఉందని అంటున్నారు. ద్రోణాచార్య మూవీతో ఇండియన్‌ సినిమా స్థితిగతులు మారబోతున్నాయి అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

ఏఐతో సినిమా నిర్మిస్తే....

మరోవైపు సినిమా ఇండస్ట్రీలో ఏఐ హద్దులు దాటితే అన్ని విధాలుగా మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతున్న లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతారు అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇండస్ట్రీలో ఏఐని వినియోగించడంలో తప్పు లేదు, కానీ పూర్తి సినిమా నిర్మాణంను ఏఐలో చేయడంను మాత్రం ఏ ఒక్కరూ హర్షించే పరిస్థితి లేదు. కార్మికులు, నటీనటులు ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్స్‌ వరకు ఏఐ వల్ల కచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పూర్తి స్థాయిలో ఏఐని వినియోగించడం సరికాదు అనేది చాలా మంది అభిప్రాయం. ఇతర రంగాల్లో ఏఐ ఎంత వరకు వెళ్లినా పర్వాలేదు కానీ, సినిమా ఇండస్ట్రీలో ఏఐ హద్దులు దాటితే లక్షలాది మంది జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనే ఆందోళనతో ఇండస్ట్రీలో కార్మికులు, నటీనటులు ఉన్నారు.

Tags:    

Similar News