అడివి శేష్ 'డెకాయిట్'.. లైఫ్ లో ఇదే ఫస్ట్ టైమ్..
రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అడివి శేష్.. తాను జీవితంలో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదని, ఇప్పుడు మృణాల్ తో తొలిసారి స్టెప్పులు వేస్తున్నట్లు తెలిపారు.;
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి అందరికీ తెలిసిందే. కాలిఫోర్నియాలో పెరిగిన ఆయన.. సినిమాలపై మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. 15 ఏళ్ల క్రితం కర్మ మూవీతో డెబ్యూ ఇచ్చారు. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించి మెప్పించారు. ఆ తర్వాత పంజా, బలుపు, బాహబలి వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
అనంతరం దొంగాట, క్షణం, గూడచారి, ఎవరు, మేజర్, హిట్ : ది సెకండ్ కేసు వంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు డెకాయిట్, గూడచారి సీక్వెల్ జీ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ముందుగా వచ్చే ఏడాది డెకాయిట్ మూవీతో థియేటర్స్ లో సందడి చేయనున్నారు.
వచ్చే నెలలో రిలీజ్ కావాల్సిన సినిమా.. వచ్చే ఏడాదికి వాయిదా పడింది. భారీ అంచనాల మధ్య రొమాంటిక్ యాక్షన్ లవ్ జోనర్ లో రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. అయితే డెకాయిట్ కు గాను కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ డ్యాన్స్ చేశారు అడివి శేష్. కెరీర్ లోనే కాదు.. జీవితంలో తొలిసారి అంట.
నిజానికి.. అడివి శేష్ ఇప్పటికే వివిధ సినిమాల్లో నటించారు. ఆయా సినిమాల్లో పాటలు అరుదుగా ఉంటాయి. వాటిలో కూడా శేష్ డ్యాన్స్ చేస్తూ కనిపించరు. నడుస్తూ.. లేక ఏదో చేస్తున్నట్టు ఉంటారు. కానీ ఇప్పుడు డెకాయిట్ లో డ్యాన్స్ చేశారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో కలిసి స్టెప్పులు వేశారు. ఆ విషయాన్ని ఆయనే రీసెంట్ గా రివీల్ చేశారు.
రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అడివి శేష్.. తాను జీవితంలో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదని, ఇప్పుడు మృణాల్ తో తొలిసారి స్టెప్పులు వేస్తున్నట్లు తెలిపారు. అయితే తన పేలవమైన డ్యాన్స్ స్కిల్స్ కు మద్దతు ఇవ్వాలని నవ్వుతూ అన్నారు. దీంతో ఈవెంట్ లో ఉన్నవారు కూడా నవ్వేశారు.
అయితే తాను డ్యాన్స్ చేసిన సాంగ్.. బోరింగ్ గా అనిపించదని తెలిపిన శేష్.. మరింత సరదాగా, ఉల్లాసంగా ఉంటుందని చెప్పారు. సాధారణంగా ఎప్పుడూ చేయని విధంగా ఉందని అన్నారు. దీంతో ఇప్పుడు తొలిసారి డ్యాన్స్ చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. అవునా నిజమా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు వెయిటింగ్ ఫర్ డ్యాన్స్ అని చెబుతున్నారు. మరి చూడాలి శేష్ ఎలా స్టెప్పులు వేశారో..