3000 కోట్ల క్లబ్ దర్శకుడితో ఎన్టీఆర్-బన్నీకి అదృష్టం లేదు!
గతంలో బడ్జెట్ సమస్యల కారణంగా విక్కీ కౌశల్‌తో అర్థాంతరంగా ఆగిపోయిన `ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ` చిత్రాన్ని ఆదిత్యాధర్ తిరిగి పట్టాలెక్కించే యోచనలో ఉన్నారు.;
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో వినిపిస్తున్న అతిపెద్ద పేరు - ఆదిత్యాధర్. `దురంధర్`, `దురంధర్- 2` చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించి.. ఏకంగా 3000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ దర్శకుడు తన తదుపరి ప్రాజెక్టుపై స్పష్టతనిచ్చారు. పాపులర్ బాలీవుడ్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన తర్వాతి చిత్రంలో కూడా రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించే అవకాశం ఎక్కువగా ఉందని స్పష్టం చేయడంతో ఆదిత్యాధర్ తో పని చేయాలనుకున్న టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
గతంలో బడ్జెట్ సమస్యల కారణంగా విక్కీ కౌశల్‌తో అర్థాంతరంగా ఆగిపోయిన `ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ` చిత్రాన్ని ఆదిత్యాధర్ తిరిగి పట్టాలెక్కించే యోచనలో ఉన్నారు. ఒకప్పుడు బడ్జెట్ భారమై ఆగిపోయిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు ఎటువంటి ఢోకా లేదు. ఎందుకంటే ఆదిత్యాధర్-రణ్‌వీర్ కాంబినేషన్ ఇప్పటికే 3000 కోట్ల వసూళ్లను సునాయాసంగా సాధించడంతో.. నిర్మాతలు ఎంతటి భారీ బడ్జెట్ పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్‌ను తన లక్కీ ఛామ్ గా భావిస్తున్న ఆదిత్యాధర్ అతడితోనే మరో సంచలనానికి సిద్ధమవుతున్నారని ఇంతకుముందే కథనాలు వెలువడ్డాయి.
నిజానికి ఆదిత్యాధర్ తర్వాతి సినిమా మన టాలీవుడ్ స్టార్ హీరోలతో ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా ప్రభాస్‌తో `అశ్వత్థామ` చేస్తారని.. ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్లు ఈ సెన్సేషనల్ డైరెక్టర్‌తో చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు ఆదిత్యాధర్ వెంటపడుతున్నా కానీ.. ప్రస్తుతానికి ఆ అవకాశం బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్‌కే దక్కినట్లు కనిపిస్తోంది. సమయం, సందర్భం కలిసి రాకపోవడంతో మన హీరోలకు ఈ అదృష్టం దక్కడం లేదనే చెప్పాలి.
ఒకవేళ రణ్‌వీర్ సింగ్‌తో ఆదిత్యాధర్ కమిట్ అయితే... అది కచ్చితంగా ఒక భారీ `సూపర్ హీరో` కాన్సెప్ట్ చిత్రమే అవుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. రణ్‌వీర్ సింగ్‌ను లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా చూపించేందుకు దర్శకుడు గట్టిగా ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. రాజమౌళి తరహాలోనే అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటాలనే పట్టుదలతో ఆదిత్యాధర్ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారతీయ సినిమాకు.. హాలీవుడ్‌కు మధ్య ఉన్న సాంకేతికత - బడ్జెట్ పరమైన అంతరాలు క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో ఆదిత్యాధర్ తీయబోయే ఈ సూపర్ హీరో సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ ని ఢీకొట్టే ప్లానింగ్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ హీరోలకు ట్యాలెంటెడ్ ఆదిత్యాధర్ తో ప్రస్తుతానికి ఛాన్స్ లేకపోయినా.. భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్లు సెట్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.