ఎన్నేళ్లో వేచిన కాంబో.. ఇంత చప్పగానా?
తెలుగు ప్రేక్షకులు ఎంతో కోరుకున్న కాంబినేషన్.. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది.
తెలుగు ప్రేక్షకులు ఎంతో కోరుకున్న కాంబినేషన్.. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది. రచయితగా దగ్గుబాటి హీరోకు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్.. దర్శకుడితో వెంకీతో సినిమా తీస్తే చూడాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు వీళ్లిద్దరి అభిమానులు. దశాబ్దం కిందటే వీరి కలయికలో సినిమాను అనౌన్స్ చేశారు కానీ.. ఎందుకో అది ముందుకు కదల్లేదు. తర్వాత ఇదిగో అదిగో అనుకుంటూనే ఏళ్లు గడిచిపోయాయి.
ఎట్టకేలకు ఈ ఏడాది వీరి కలయికలో సినిమా మొదలైంది. ‘ఆదర్శ కుటుంబం’ అనే ఆకర్షణీయ టైటిల్ పెట్టి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు త్రివిక్రమ్. ఐతే ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన సినిమా ఒక రేంజిలో ఉంటుందని.. ప్రోమోలు అదిరిపోతాయని.. రిలీజ్ టైంకి దీని హైప్ కూడా వేరే లెవెల్‌కు చేరుతుందని ఆశించారు అభిమానులు. కానీ ఇప్పటికైతే అంచనాలకు చాలా దూరంలోనే ఉంది ‘ఆదర్శ కుటుంబం’.
ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన క్యారెక్టర్ ఇంట్రో వీడియోలు కానీ.. టీజర్ కానీ అనుకున్నంత కిక్కు ఇవ్వలేకపోయాయి. త్రివిక్రమ్ మార్కు వాటిలో మిస్సయిందనే ఫీలింగ్ కలిగింది. కథ పరంగా కూడా ఏమంత ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. ఎన్నోసార్లు చూసిన స్టోరీనే ఇటు అటు తిప్పి తీశాడా అనిపించేలా ఉన్నాయి ప్రోమోలు. త్రివిక్రమ్ కంటే అనిల్ రావిపూడినే వెంకీతో చేసిన సినిమాలకు ఎక్కువ హైప్ క్రియేట్ చేయగలిగాడనే ఫీలింగ్ కలిగింది. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌కు అటు ఇంకో 12 రోజులే సమయం ఉంది. ఇప్పటివరకైతే సినిమాకు ఆశించిన హైప్ లేదు. ఈ స్థాయి సినిమాకు ప్రమోషన్ల పరంగా ఇప్పటికే హడావుడి కనిపించాలి. ప్రేక్షకులు ఆ సినిమా గురించి చర్చించుకునేలా.. దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూసేలా చేయాలి.
కానీ ‘ఆదర్శ కుటుంబం’ టీం ప్రమోషన్ల గురించే పట్టించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. నాని సినిమా ‘ది ప్యారడైజ్’ ఫలితం ఎలా అయినా ఉండనీ.. దీనికి వచ్చిన ప్రి రిలీజ్ హైప్ అంతా ఇంతా కాదు. కానీ క్రేజీ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ అందులో పావువంతు హైప్ కూడా క్రియేట్ చేయలేదన్నది వాస్తవం. కాకపోతే ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి కంటెంట్ బాగుంటే ఆటోమేటిగ్గా పుంజుకుంటుందని, సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని టీం భావిస్తుండొచ్చు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.