అల్లర్ల కేసులో నటి అరెస్ట్... బిగ్ ట్విస్ట్ ఏమిటంటే..?
గత ఏడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో బంగ్లాదేశ్ నటి నస్రత్ ఫరియాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.;
గత ఏడాది విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిలో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె పార్టీ అవామీలీగ్ మద్దతుదారులైన హిందూ మైనారిటీలు, వారి ప్రార్ధనా మందిరాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సమయంలో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హసీనాపై హత్య సహా పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. నాడు ఆమె బంగ్లా నుంచి పారిపోయి భారత్ వచ్చేశారు. ఈ క్రమంలో ఆమె పార్టీ నేతలతోపాటు, సన్నిహితులపైనా హత్య కేసులు పెట్టారు. ఈ సమయంలో ఆమె బయోపిక్ లో నటించిన నటిపైనా కేసు పెట్టడం గమనార్హం.
అవును... గత ఏడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో బంగ్లాదేశ్ నటి నస్రత్ ఫరియాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఢాకా నుంచి థాయిలాండ్ కు వెళ్తుండగా.. షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు!
ఈ సందర్భంగా స్పందించిన ఢాకా ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ యూనిట్ వర్గాలు... హసీనా దేశాన్ని వదిలి పారిపోయిన సమయంలో జరిగిన అల్లర్లలో ఆమెపై హత్యాయత్నం కేసు నమోదయ్యిందని, అందులో భాగంగానే అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారని తెలిపాయి. ప్రస్తుతం ఆమెను ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందించిన "ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్" సినిమాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాత్రను నుస్రత్ ఫరియా పోషించారు. 2023లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించింది.