పవర్‌స్టార్ అత్త ఫ్యాన్ గాళ్ మూవ్‌మెంట్!
ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన తారని కలవాలని, వారితో మాట్లాడాలని ఉంటుంది.;
ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన తారని కలవాలని, వారితో మాట్లాడాలని ఉంటుంది. అదే ఫీలింగ్ మన స్టార్లకు కూడా వారికి ఇష్టమైన నటీనటులని ఉంటుంది. అలాంటి సందర్భం ఎదురైతే వారి ఆనందానిక అవధులు ఉండవు. సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేస్తారు. తమ ఆనందాన్ని వారితో పంచుకుని మురిసిపోతారు. ఆ క్షణాలని జీవితంలో మర్చిపోలేనివి గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడ ఇదే ఫీలింగ్‌ని ఆస్వాదిస్తోంది టాలీవుడ్ పాపుల్ అత్త.. పాపులర్ నటి నదియా.
సుధీర్ఘ విరామం తరువాత ప్రభాస్ `మిర్చీ` సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన నదియా `అత్తారింటికి దారేది`, దృశ్యం, అఆ వంటి వరుస బ్లాక్ బస్టర్‌లతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన `అత్తారింటికి దారేది` మూవీలో టైటిల్ రోల్ పోషించి అత్తగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కొంత క్రేజ్ తగ్గడంతో తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాలకు దూరంగా ఉంటోంది.
తెలుగులో రామ్ నటించిన `ది వారియర్` తరువాత ఆమె మరో సినిమా అంగీకరించలేదు. తమిళ, మలయాళ భాషల్లోనూ 2023 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ ని అంగీకరించలేదు. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న నదియా రీసెంట్ గా ఆస్ట్రేలియాలోని సిడ్నీ పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా తన చిరకాల హాలీవుడ్ ఫేవరేట్ స్టార్ నికోల్ కిడ్మాన్‌ని కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఫ్యాన్ గాళ్ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలని, వీడియోస్‌ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
అంతే కాకుండా తన అభిమాన నటిని కలవడం ఎప్పటికీ మరిచిపోలేనిదని, ఇదొక చిరకాల స్మరణీయమైన సంఘటనగా అభివర్ణించింది. నికోల్ కిడ్మాన్‌ని నదియా కలిసి సందర్భంలో తను తనపై చూపించిన ఆప్యాయత ఫొటోల్లో కనిపించింది. ఒక ఫొటోలో నదియా కంటే హైట్‌గా కనిపించిన నికోల్ తరువాత ఫోటోలో మాత్రం నదియా భుజంపై చేయివేసి హత్తుకుని కనిపించడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా తన అభిమాన నటి నికోల్‌తో కలిసి సెల్ఫీలకు పోజులిచ్చిన వీడియోని కూడా నదియా షేర్ చేసింది.
ఆస్ట్రేలియాలో నాకు ఇష్టమైన నటీమణులలో ఒకరైన నటి నికోల్‌ని కలిశాను. నమ్మశక్యం కానీ ఆమె దయని చూశాను. అలాగే ఆమె చాలా పొడవు ఉన్నప్పటికీ నా ఎత్తుకు సరిపోయేలా అమె వంగడానికి కూడా వెనుకాడలేదు` అని నదియా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. నదియా షేర్ చేసిన ఫొటోలు చూసిన నెటిజన్‌లు ఇద్దరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గాయకుడు విజయ్ యేసుదాస్ ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. నదియా కూడా ఇండియాలో పెద్ద స్టార్ అని, ఆ విషయాన్ని ఎవరైనా నికోల్‌కు తెలపండన్నాడు. ప్రస్తుతం నదియా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.