విజయ్ పాలిటిక్స్.. ఆలోచన ఎలా ఉందంటే?
తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు అధికారికంగా ప్రకటించి, ‘జన నాయకన్’ మూవీ తాను నటించే చివరి చిత్రం అని చెప్పిన సంగతి తెలిసిందే.;
తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు అధికారికంగా ప్రకటించి, ‘జన నాయకన్’ మూవీ తాను నటించే చివరి చిత్రం అని చెప్పిన సంగతి తెలిసిందే. సొంతంగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీకి పూర్తిగా సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకటన ఆయన అభిమానుల్లో కాస్త బాధ కలిగించినా, రాజకీయంగా విజయ్ సీరియస్‌గా ఉన్నాడని స్పష్టమైంది.
అయితే ఇప్పటివరకు రాజకీయాల కోసం సినిమాలకు వీడ్కోలు చెప్పిన స్టార్లు అందరూ తిరిగి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చినవారే. అందులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు మొదట పొలిటికల్ కమిట్‌మెంట్స్‌తో పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు. కానీ తర్వాత ప్రేక్షకుల ఆహ్వానం, ఫాన్స్ డిమాండ్‌తో మళ్లీ వెండితెరపై కనిపించారు. ఇప్పుడు ఇదే పరిస్థితి విజయ్‌కి ఎదురవుతుందా అనే ఆశ అభిమానుల్లో ఉంది.
ఇప్పుడు ఆ ఆశలకు మరింత బలం చేకూర్చేలా మమితా బైజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మలయాళ బ్యూటీగా ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మమితా ప్రస్తుతం జన నాయకన్ సినిమాలో విజయ్ సరసన నటిస్తోంది. షూటింగ్ చివరి రోజున విజయ్‌ను ఇది మీ చివరి సినిమా కదా అని మమితా అడిగినప్పుడు, విజయ్ మాత్రం డైరెక్ట్ గా సమాధానం ఇవ్వలేదట. సినిమాలు ఆపేస్తాను అని పక్కాగా ఒప్పుకోలేదని ఆమె హింట్ అయితే ఇచ్చింది. అంటే విజయ్ ఇక సినిమాల్లో నటించరనే విషయాన్ని ఖరారు చేయలేదన్నమాట.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తన సినిమా భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. అంటే వచ్చే రెండేళ్ల పాటు ఆయన పూర్తిగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టబోతున్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు గ్రౌండ్ వర్క్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలపై ప్రస్తుతం ఫోకస్ లేకపోయినా, పర్యవేక్షణలో మాత్రం ఉంచినట్టే.
జన నాయకన్ సినిమాకు హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు హిట్ మూవీ భగవంత్ కేసరికు రీమేక్‌గా రూపొందుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కానీ అఫీషియల్ గా ఆ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో విజయ్ పాత్రలో కొత్త కోణాలు ఉంటాయని, రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో చూపించాలనే ఉద్దేశంతో కథను డిజైన్ చేశారని తెలుస్తోంది. విజయ్ సినీ కెరీర్, రాజకీయ లక్ష్యాల మధ్య ఎలాంటి బ్యాలెన్స్ ఏర్పడుతుందో తెలియాలి అంటే కాలమే నిర్ణయించాలి.