దేశం విడిచి వెళ్లాలనుకున్న స్టార్ కపుల్..మరీ అంతలా బాధించారా?
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలల ఏం జరుగుతోంది అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది.;
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలల ఏం జరుగుతోంది అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఏ విషయమైనా సరే క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇక సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇకపోతే సెలబ్రిటీలకు సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఆ సెలబ్రిటీలకు ఎంతటి నరకాన్ని కలిగిస్తున్నారో అప్పుడప్పుడు వారే స్వయంగా బయట చెప్పుకుంటుంటే అర్థమవుతుంది. అలా ఇప్పటికే ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొని ఇబ్బంది పడ్డ సెలబ్రిటీలు కోకొల్లలు.
ఈ క్రమంలోనే ఇలా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్, రూమర్స్ ను తట్టుకోలేక ఏకంగా ఒక స్టార్ కపుల్ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని.. ఏదైనా ఒక హోటల్లో పని చేసుకుని బ్రతుకుదామని అనుకున్నారట. ఈ విషయం వారే స్వయంగా చెప్పడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు..మరి ఆ స్టార్ జంట ఎవరు? ఎందుకు వారిని అంతలా బాధపెట్టారుమీ అనే విషయానికి వస్తే.. ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు ప్రముఖ హీరో నందు, స్టార్ సింగర్ గీతామాధురి. 2006లో నందు ఫోటో అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు.
ఆ తర్వాత రాంగోపాల్ వర్మ 365 డేస్, సుకుమార్ 100% లవ్ వంటి చిత్రాలలో కీలకపాత్రలు పోషించిన ఈయన.. ఆటోనగర్ సూర్య, పాఠశాల, రభస, ఐస్ క్రీమ్ ఇలా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరించిన నందు.. సెహరీ , బొమ్మ బ్లాక్ బాస్టర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఇప్పుడు సైక్ సిద్ధార్థ అనే సినిమాతో జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన నందు ఇంటర్వ్యూలో భాగంగా తన కెరియర్ , ఫ్యామిలీ గురించి అలాగే సోషల్ మీడియాలో తాము ఎదుర్కొన్న రూమర్స్ గురించి స్పందించారు.
ఇంటర్వ్యూలో భాగంగా నందు మాట్లాడుతూ.." నేను గనుక ఈ సినిమా ఫీల్డ్ లోకి రాకపోయి ఉండుంటే.. నా పైన ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళు కాదు కదా.. ముఖ్యంగా చూసేవాళ్ళు ఎన్నో అనుకుంటారు. కానీ వాళ్ళకు ఎవరికీ దీని వెనక ఏం జరుగుతోంది అనే విషయం తెలియదు. మనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే మనం ఏం చేయలేమని.. సంబంధంలేని అంశాలలో కూడా మన పేర్లను చేరుస్తారు. అలా నేను చేయని పనికి నా మీద ఆరోపణలు వచ్చాయి. నా కుటుంబం కూడా బాధపడింది. అప్పుడే నా భార్య గీత.. ఇక్కడ ఉండలేం.. అన్నీ వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోయి ఏదైనా హోటల్లో పని చేసుకుంటూ బ్రతికేద్దామని చెప్పింది. ఆ మాటలు గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ కన్నీళ్ళాగవు అంటూ ఎమోషనల్ అయ్యారు.
అయితే నందు ఆయన భార్య ఇంతలా బాధపడడానికి కారణం.. 2017 లో టాలీవుడ్ డ్రగ్స్ స్కాండల్లో నందు పేరు ప్రముఖంగా వినిపించడమే. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నందుని విచారించాయి. ఈ ఆరోపణలు తన జీవితంలో అత్యంత బాధాకరమైన 12 రోజులని.. తాను చేయని పనికి తన పేరును అనవసరంగా ఈ కేసులో ఇరికించారు అంటూ నందు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో తన భార్య గీత మాధురి పడిన బాధను కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇవే కాకుండా విడాకుల రూమర్స్ కూడా ఎదుర్కోవడం జరిగింది.