డైరెక్టర్లే హీరోలైపోతే హీరోల పరిస్థితేంటి బాస్!
బ్లాక్ బస్టర్ సినిమాలతో దర్శకులుగా ప్రత్యేకతను చాటుకున్న దర్శకులు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తడం ఆనవాయితీగా మారుతోంది.;
బ్లాక్ బస్టర్ సినిమాలతో దర్శకులుగా ప్రత్యేకతను చాటుకున్న దర్శకులు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తడం ఆనవాయితీగా మారుతోంది. తమిళంలో భాగ్యరాజా నుంచి ప్రదీప్ రంగనాథన్ వరకు క్రేజీ దర్శకులు హీరోగా మారి వరుస సినిమాలతో ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో చేరిన లోకేష్ కనగరాజ్ త్వరలో హీరోగా అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ తరహాలోనే మరో యంగ్ డైరెక్టర్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.
తనే అభిషన్ జీవింత్. శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ `టూరిస్ట్ ఫ్యామిలీ`. 2025 ఏప్రిల్ 29న సైలెంట్‌గా విడుదలై తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షభం తలెత్తడంతో చెన్నైకి చేరుకున్న ఓశ్రీలంకన్ ఫ్యామిలీ నేపథ్యంలో ఆద్యంత ఆసక్తికరంగా ఈ మూవీని రూపొందించారు. మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్లు రాబట్టిన ఈ సినిమా 2025లో విడుదలైన తమిళ సినిమాల్లో దిబెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.
ఈ సినిమాతో యంగ్ టాలెంటెడ్ అభిషన్ జీవింత్ దర్శకడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకున్నాడు. రాజమౌళి, రజనీకాంత్ సైతం ఈ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించడంతో దర్శకుడు అభిషన్ జీవింత్ నెట్టింట ట్రెండ్ అయ్యాడు. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాని అందించి తన సత్తా చాటుకున్న అభిషన్ జీవింత్ ఇప్పుడు మరో అడుగు వేస్తున్నాడు. తను హీరోగా రొమాంటిక్ కామెడీ లవ్‌స్టోరీతో పరిచయం కాబోతున్నాడు.
ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారి లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో వరుస హిట్‌లని సొంతం చేసుకుని మరో రొమాంటిక్ కామెడీ `లవ్ ఇన్సూరెన్స్ కంపనీ`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ `టూరిస్ట్ ఫ్యామిలీ` డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా పరిచయం కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. అభిషన్ జీవింత్ హీరోగా నటిస్తున్న మూవీ `విత్ లవ్`. మదన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. `రేఖాచిత్రం`, `ఛాంపియన్` సినిమాల ఫేమ్ అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇటీవలే టైటిల్ టీజర్‌ని విడుదల చేశారు. న్యూ ఇయర్‌సందర్భంగా అభిషన్ జీవింత్ ఈ మూవీకి సంబంధించిన కీలక అప్‌డేట్‌ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ``విత్ లవ్` మిమ్మల్ని నవ్విస్తుంది. సంతోషపరుస్తుంది. మీరు నిజంగా ప్రేమించబడ్డారనే భావనని కలిగిస్తుంది. సినిమా ఫైనల్ ఔట్‌పుట్ చూసుకున్నాక నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. మా ప్రయత్నాలు అర్థవంతమైన ఫలితాన్ని ఇచ్చాయని తెలిసి నేను చాలా సంతోషించాను. ఇది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను` అని పేర్కొన్నాడు. రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.