రెండు పార్ట్‌ల మధ్య పెద్ద తేడా ఇదే..!
తాజాగా సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సినిమాపై అంచనాలు పెంచాడు.;
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ త్వరలో 'సితారే జమీన్ పర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. స్వీయ దర్శకత్వంలో తారే జమీన్ పర్ సినిమాను రూపొందించిన ఆమీర్ ఖాన్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని దేశం మొత్తం చర్చ జరిగే విధంగా చేశాడు. అలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించిన ఆమీర్ ఖాన్ ఆ తర్వాత పలు కమర్షియల్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఆయన కమర్షియల్‌గా సక్సెస్ కాలేక పోతున్నాడు.
ఇలాంటి సమయంలో తన సూపర్ హిట్ తారే జమీన్ పర్ సినిమాకి సీక్వెల్‌ను తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. 2023లో సితారే జమీన్ పర్ సినిమాను ప్రకటించిన ఆమీర్ ఖాన్ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేశాడని సమాచారం అందుతోంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. మొదటి పార్ట్‌కు సొంతంగా దర్శకత్వం వహించిన ఆమీర్ ఖాన్ సీక్వెల్‌కి మాత్రం ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సినిమాపై అంచనాలు పెంచాడు.
ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ... సితారే జమీన్ పర్ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం వేచి చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోనూ మంచి కథ, మెసేజ్‌ను ప్రేక్షకులకు చెప్పబోతున్నామని అన్నారు. సీక్వెల్ కథ మొత్తం దివ్యాంగుల చుట్టూ తిరుగుతుంది. అప్పుడు తారే జమీన్ పర్ ప్రేక్షకులను ఏడిపించింది. కానీ ఈసారి సితారే జమీన్ పర్ నవ్వించే విధంగా ఉంటుంది. ఇక మొదటి పార్ట్‌లో తన పాత్ర చాలా స్మూత్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. సితారే జమీన్ పర్‌లో ఆమీర్ ఖాన్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట.
రెండు పార్ట్‌లకు ప్రధానమైన తేడా ఒకటే ఉందని, అది మొదటి పార్ట్ ఏడిపిస్తే, ఈ సీక్వెల్ నవ్విస్తుందని అన్నాడు. ప్రేక్షకులను తప్పకుండా అలరించే విధంగా సినిమా ఉంటుందని ఆమీర్ ఖాన్ హామీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం దివ్యాంగులతో ఆమీర్ ఖాన్ నటించారు. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయమై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరింది. కనుక సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను ఆమీర్ ఖాన్, తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి నిర్మించారు. హిందీలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ లుక్ ఇప్పటికే రివీల్ అయింది. ఆమీర్ లుక్ వైరల్ అయిన విషయం తెల్సిందే. సూపర్ హిట్‌కి సీక్వెల్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.